న్యూఢిల్లీ, మార్చి 10: కాంగ్రెస్‌కు మరోమారు ఆశాభంగం ఎదురైంది. ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాల్లో అధికారంలో ఉన్న పంజాబ్ సహా మరే రాష్ట్రంలోనూ ఆ పార్టీ ప్రభావం చూపలేకపోయింది. 130 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన హస్తం పార్టీకి గత కొన్నేండ్లుగా గెలుపు రేఖలు దూరమవుతూనే వస్తున్నాయి. దశాబ్దం క్రితం 13 రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న ఆ పార్టీ.. రెండు రాష్ర్టాలకే పరిమితమయ్యే పరిస్థితి దాపురించింది.
గ్రాండ్ ఓల్డ్ పార్టీ (కాంగ్రెస్) అధికార పగ్గాలు చేపడితే గాంధీ కుటుంబం వారే చేపట్టాలన్న పాత చింతకాయ పచ్చడి సిద్ధాంతం ఆ పార్టీ పతనానికి ప్రధాన కారణంగా మారింది. సోనియాకు వయసు మీదపడటం, రాహుల్.. సీనియర్లకు విలువ ఇవ్వకుండా ఒంటెద్దు పోకడలకు పోవడం పార్టీని మరింతగా దిగజార్చింది. దీన్ని గమనించిన 23 మంది పార్టీ సీనియర్ నేతలు అధిష్ఠానానికి లేఖ రాశారు. పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరమున్నదని పేర్కొన్నారు. ఆ హెచ్చరికలను పక్కనబెట్టిన అధిష్ఠానం లేఖరాసిన వారికి జీ-23గా పేరుపెట్టి వేరుగా చూడటం ప్రారంభించింది. నాయకత్వ, వ్యవస్థీకృత లోపాలు, కొత్తవారికి అవకాశం ఇవ్వకపోవడం, కష్టపడి పనిచేసేవారిని పక్కనబెట్టడం వెరసి ఆ పార్టీ నానాటికీ సంక్షోభంలోకి జారుకొంటున్నది.
పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే సరైన నాయకుడిని ఎంచుకొనే విషయంలో, సీనియర్లను బుజ్జగించే అంశంలో కాంగ్రెస్ కిలోమీటర్ దూరంలో ఉండేది. దీని ఫలితంగానే హిమంత బిశ్వశర్మ, జ్యోతిరాదిత్య సింధియా, మహువా మొయిత్రా తదితరులు పార్టీని వీడారు. రాష్ర్టాల్లో హంగ్ ఏర్పడినప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు చొరవ తీసుకోవడంలో కాంగ్రెస్ ఎప్పుడూ చతురత ప్రదర్శించలేదు. మధ్యప్రదేశ్, కర్ణాటక, గోవా, మణిపూర్ తదితర రాష్ర్టాల్లో మెజారిటీ స్థానాలు సాధించినప్పటికీ అధికారం చేపట్టలేకపోయింది. ట్రబుల్ షూటర్లుగా పేరున్న ప్రణబ్‌ముఖర్జీ, అహ్మద్ పటేల్ మరణం, గులాంనబీ ఆజాద్ వంటి నేతలు పార్టీతో అంతగా సఖ్యతగా ఉండకపోగెస్ను కోలుకోలేని దెబ్బ తీస్తున్నది.
కాంగ్రెస్‌ను ప్రధాన ప్రతిపక్షంగా ప్రాంతీయ పార్టీలు ఎప్పుడో మరిచిపోయాయి. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ సాయపడ్డప్పటికీ, ఆ పార్టీని ఎవరూ గుర్తించట్లేదు. తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే మిత్రపక్షంగా కాంగ్రెస్ బరిలోకి దిగినా.. స్టాలిన్ చరిష్మాతోనే హస్తంకు ఆ మాత్రం సీట్లు వచ్చాయన్నది విశ్లేషకుల మాట. యూపీ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కాంగ్రెస్‌ను దూరం పెట్టాయి. ఒకప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలో స్థానిక పార్టీలు కూటమిగా ఏర్పడి పనిచేశాయి. అయితే నానాటికీ తీసికట్టుగా తయారవుతున్న కాంగ్రెస్‌ను నమ్మి 2024లో బరిలోకి దిగడానికి ఏ పార్టీ ఆసక్తి చూపడంలేదు. కేంద్రంలోని బీజేపీని గద్దె దింపడానికి తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్, బెంగాల్ సీఎం మమత, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన, ఆప్ తదితర పార్టీలు కంకణం కట్టుకొన్నాయి. అయితే తమకు మార్గనిర్దేశం చేయాల్సిందిగా ఏ పార్టీ కూడా కాంగ్రెస్‌ను ఆశ్రయించకపోవడం ఆ పార్టీ పరిస్థితి ఏమిటో చెప్పకనే చెబుతున్నది.
ఇతర రాష్ర్టాల్లో మాదిరిగానే తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తయారయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా నాయకత్వలేమిని ఎదుర్కొంటున్న ఆ పార్టీ తెలంగాణలోనూ అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఆయన ఒంటెద్దు పోకడలను జగ్గారెడ్డి, మధుయాష్కీ, వీహెచ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు చాలా మంది నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఆ పార్టీ పోటీఇచ్చే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.