సుల్తాన్‌బజార్, ఏప్రిల్ 2: నూతన కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు టీఎస్ ఆర్టీసీ నిరంతరం కృషి చేస్తున్నదని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ (ఎంజీబీఎస్)లో ప్రయాణికుల సౌకర్యా ర్థం ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ బగ్గీ వాహనాన్ని శనివా రం ఆయన ప్రారంభించారు. ఎంజీబీఎస్ ప్రాంగణంలోని గాంధీజీ విగ్రహం నుంచి వరంగల్ ప్లాట్‌ఫాం వరకు బగ్గీలో ప్రయాణించారు. అనంతరం గోవర్ధన్ మాట్లాడుతూ.. ఎంజీబీఎస్‌కు వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, మహిళా ప్రయాణికులను ఉచితంగా ప్లాట్‌ఫాం వద్దకు చేరవేసేందుకు ఎలక్ట్రిక్ బగ్గీ సేవల ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇప్పటివరకు విమానాశ్రయాలకే పరిమితమైన ఈ సేవలను త్వరలో రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లలో ప్రవేశపెడతామని చెప్పారు.
చిల్లర సమస్యను పరిష్కరించేందుకే..
ఆర్టీసీ చార్జీలను పెంచినట్టు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో అర్థం లేదని గోవర్ధన్ తోసిపుచ్చారు. చిల్లర సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకే రౌండ్ ఫిగర్ చార్జీలను ప్రవేశపెట్టామని, దానిలో భాగంగానే రూ.17 ఉన్న టికెట్‌ను రూ.15కి.. రూ.18 ఉన్న టికెట్‌ను రూ.20కి మార్చామని వివరించారు. సెస్సు రూపంలో ప్రయాణికుల నుంచి కేవలం రూపాయి మాత్రమే వసూలు చేస్తున్నామని, ఇది అన్ని రాష్ర్టాల్లో అమలవుతున్నదేనని తెలిపారు. ప్రస్తుతం డీజిల్ ధరలు, టోల్ ఫీజులు పెరగటంతో ఎదురవుతున్న నష్టాల నుంచి ఆర్టీసీకి వెసులుబాటు కల్పించేందుకు అన్ని మార్గాలను వినియోగించుకొంటున్నామన్నారు. ప్రజలంతా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సంస్థ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అనంతరం ఎంజీబీఎస్‌లోని రెస్ట్ రూమ్‌లో 500 పుస్తకాలతో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ ఈడీలు పీవీ మునిశేఖర్, పురుషోత్తం నాయక్, రంగారెడ్డి రీజినల్ ఆర్ఎం సాల్మన్ తదితరులు పాల్గొన్నారు.