Tamil Nadu : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి వేగంగా వచ్చిన ప్రభుత్వ బస్సు.. ఒక టెంపోను, బైకును ఢీకొంది. ఈ ఘటనలో 8 మంది మరణించారు. ఈ ప్రమాదం తమిళనాడులోని అరియనూర్ సమీపంలో, ఉత్తమ సోలాపురం వద్ద, సేలం జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. తమిళనాడు స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (టీఎన్ఎస్టీసీ)కి చెందిన బస్సు 40 మంది ప్రయాణికులతో కోయంబత్తూర్ నుంచి సేలం బయల్దేరింది. బస్సు వేగంగా వెళ్తుండగా, అదుపుతప్పి తన లేన్ దాటి పక్కకు వచ్చింది.
వెంటనే రోడ్డుపై డివైడర్ దాటి మరోవైపు రోడ్డుపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో అదే రోడ్డుపై అటు నుంచి వస్తున్న టెంపో వాహనాన్ని (గూడ్స్ ఆటో) ఢీకొంది. ఆ తర్వాత అటు నుంచే వస్తున్న బైకును ఢీకొంది. ఈ ఘటనలో టెంపోలోని వారితోపాటు, బైకుపై వెళ్తున్న వారిపై నుంచి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించారు. టెంపోలో మొత్తం 10 మంది ఉన్నారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు, సమీప బంధువులు. ఒక వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా బస్సు ఢీకొంది. ఘటనలో ఎనిమిది మంది మరణించగా, మరికొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు.
సీసీటీవీ ఫుటేజ్
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం
సేలం ప్రాంతంలో అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లిన ప్రభుత్వ బస్సు
8 మంది మృతి, వీరిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి pic.twitter.com/78oyGUF8D6
— Telugu Scribe (@TeluguScribe) March 20, 2026
మృతులను సెల్వరాజ్, మురుగన్, అమూధ, మణికందన్, ఇరుసాయి, సత్య (మణికందన్ భార్య), ఐదేళ్ల నితీష, 11 నెలల జీవికగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సులోని ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది.