Eesha Movie | ఇటీవల ‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ వంటి వరుస కల్ట్ హిట్స్ అందించిన సక్సెస్ఫుల్ జోడీ బన్నీ వాస్, వంశీ నందిపాటి. వీరిద్దరూ కలిసి ఇప్పుడు ప్రేక్షకులకు ఒక క్రేజీ హారర్ అనుభూతిని పంచడానికి సిద్ధమయ్యారు. వీరి సరికొత్త హారర్ థ్రిల్లర్ ‘ఈషా’ డిసెంబర్ 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ చిత్రం గురించి మేకర్స్ తాజాగా ‘వార్నింగ్ వీడియో’ పేరిట ఒక ఆసక్తికరమైన వీడియోను విడుదల చేశారు. సాధారణంగా హారర్ సినిమాలకు ట్రైలర్లు రావడం సహజం, కానీ ఇలా ప్రత్యేకంగా హెచ్చరిక వీడియో రావడం హారర్ జానర్లోనే ఇదే తొలిసారి.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఆత్మలు, దెయ్యాలు లేవని బలంగా నమ్మే కొందరు స్నేహితుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సమాజంలోని మూఢనమ్మకాలను, దొంగ బాబాలను ఎండగట్టాలని వారు భావిస్తారు. ఈ క్రమంలో వారికి పృథ్వీరాజ్ (బబ్లూ) నుంచి ఒక సవాలు ఎదురవుతుంది. “ఆత్మలు ఉన్నాయని నిరూపిస్తే..?” అంటూ ఆయన విసిరే ఛాలెంజ్‌తో ఈ స్నేహితుల బృందం ఒక చీకటి ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. మనుషుల్లాగే కొన్ని స్థలాలు కూడా పుట్టుకతోనే శాపగ్రస్తమై ఉంటాయి.. కాలక్రమేణా అవి ఆత్మలకు నిలయాలుగా మారుతాయి” అని దర్శకుడు శ్రీనివాస్ మన్నె ఇచ్చిన వార్నింగ్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. ట్రైలర్ మరియు ఈ వార్నింగ్ వీడియోలో కనిపించిన విజువల్స్ భయానకంగా ఉన్నాయి. ముఖ్యంగా పాడుబడిన బంగ్లా, క్షుద్ర పూజల సెటప్, బ్లూ అండ్ డార్క్ థీమ్ విజువల్స్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.
సంతోష్ లైటింగ్, ధృవన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలోని భయాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఈ చిత్రంలో ఉండే సడన్ ట్విస్ట్‌లు చూసి భయపడే అవకాశం ఉన్నందున, గుండె బలహీనంగా ఉన్నవారు ఈ సినిమా చూడకూడదని చిత్ర బృందం స్పష్టం చేసింది.
హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో త్రిగుణ్, అఖిల్ రాజ్ హీరోలుగా నటించగా, హెబ్బా పటేల్ హీరోయిన్గా నటించింది. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 25న విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి. వీడియో కంటెంట్ తోనే ఇంత భయపెడుతున్న ‘ఈషా’.. వెండితెరపై ఇంకెలా ఉంటుందోనని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.