శ్రీరమణీయమౌ తెనుగుచెల్వ రహించెడి భూమియందు నా-
నా రుచిర ప్రభావముని నాథలసద్గిరిఁ నారసింహ వి-
ద్యారసికుండు యాదముని యప్రతిమానుడుపాస్తి సేయగా
ధీరతఁ భానుకోటి శతదీధితి తద్గిరి కందరంబులన్
మీరగనుద్భవించెను సమీరకుమార నిషేవ్యపాదుడై
ఘోరకఠోర వజ్రనఖకుంఠిత దానవరాజుడై సరో-
జారుణలోచన త్రయకచత్పటువీర రసావతారుడై
తారలు శీర్షమాల్యములు తత్పదపీఠము భోగివాసమున్
భూరి భుజాప్రభావళులు పూర్ణదిశాంచలముల్ నిజోద్ధతిన్
తీరగ నీత్రిలోకముల నెందున కన్నను తానె తోచుచున్
వారితపాపుడై యసురబాలక వల్లభుడై చెలంగు పౌ-
రాణిక విగ్రహుండు గుణరాశి యతండె శ్రుతీడ్యుడౌ జగత్త్రయీ-
కారణ కారణుండు నతకల్ప మహీరుహముగ్రమూర్తి ల-
క్ష్మీ రమణీమణీ రసికశేఖరుడుద్యత హేతిజాతుడై
మారమనోహరాకృతిని మాకిలవేల్పుగ తోచు వాడు వే-
దో రుపురాణకావ్యమను యోగముఖ ప్రతిపాద్యదైవతం-
బారయుగాట మమ్ముల కృపార్ద్రకటక్షవిలాసమొప్పగా
కోరికలిచ్చుచున్ నిరతగోప్తగ నిల్చుచు భక్తకోటులన్
తారణ సేయుగాతనిక తథ్యముగా నరసింహమూర్తి పెం
పారెడి నూత్నమందిరమహస్సులు రాజిల యాదశృంగిపై…
లలితాదిత్య (శతావధాని, అమెరికా)