యాదర్షి తపో ఫలముగ క్షేత్రాధీశుని కృపాకటాక్షాలు
అవతరించినవి నవనారసింహుల అపురూప రూపాలు
క్షేత్ర పాలకుడు హనుమయిచ్చె కార్యదక్షతాక్షతలు
రాష్ట్ర పాలకుడు తలదాల్చిబూనె యాదాద్రి నిర్మాణాలు
ఆనందసాయి అకుంఠిత దీక్షకివి సత్కిరీటాకృతులు
స్థపతి, సూత్రగాహి తక్షకాదుల అవిరళ కార్యశాలలు
ఆగమ శాస్ర్తానుసారమై నిలిచె యాదాద్రి వైభవాలు
కృష్ణశిలలు పరవశించి పల్లవించగ ప్రణవనాదాలు
ఉద్భవించె విశ్వ విఖ్యాత రాజగోపుర కళావిన్యాసాలు
ఆలయప్రాకార కుడ్యాలు శిల్పి నైపుణ్య శోభితాలు
నారసింహుని పరివార దేవతల పరివేష్టితాలు
ద్వాదశ ఆళ్వారులు నెలవైన ఆలయ మంటపాలు
నలుదిశల ద్వారాలు బాలపాదస్తంభాలు
కళాకేళితో నారసింహుని బ్రహ్మోత్సవాలు
సకల దేవతల శుభకామనల సాక్షాత్కారాలు
మాడవీధులా! అవి జీవకోటికి మోక్షదాయకాలు
అడుగడుగునా వెల్లివిరియు ఆధ్యాత్మిక సౌరభాలు
భగవంతుని రూపాలు- భక్త హృదయ రంజకాలు
స్వర్గసీమను తలపించు సజీవ శిల్పకళాఖండాలు
చంద్రశేఖరునికవి శాశ్వత యశోభూషణాలు
ప్రకృతి శోభల సుగంధ పరిమళ కాంతులు
భగవంతుని లీలకవి సాక్షీభూతాలు
అదిగదిగో శిల్పాద్రి.. అదే మన యాదాద్రి..!
డాక్టర్
నమిలకొండ సునీత
99084 68171