జీవితంలో దుఃఖాలు చుట్టుముట్టినప్పుడు, ఆపదలు ఎదురైనప్పుడు, అపజయాలు కలుగుతున్నప్పుడు అంతా చీకట్లు ఆవరించినట్లుగా అనిపిస్తుంది. చీకటిలో దారీతెన్ను తెలియదు. ద్వాపరయుగ అంతంలో శ్రీకృష్ణ భగవానుడు ధర్మజ్ఞానాదులతో కూడి స్వధామానికి వెళ్లిపోయాడని చెబుతుంది భాగవతం. జగత్తులో ధర్మం కొరవడినప్పుడు అంతటా చీకట్లు మూగినట్లే కదా! అలాంటి ధర్మరహిత స్థానంలో మానవుడు నిశ్చయంగా దుఃఖాలను, కష్టాలను అనుభవించ వలసి వస్తుంది.
కృష్ణే స్వధామోపగతే ధర్మజ్ఞానాదిభిః సహ
కలౌ నష్టదృషామేష పురాణార్కోధునోదితః (భాగవతం 1.3.43)
కలియుగంలో అజ్ఞానాంధకారంతో దృష్టి కోల్పోయిన మానవులకు వెలుగు చూపడానికే శ్రీమద్భాగవతం ఉదయించింది. చీకటిని తొలగించేది కాబట్టి ‘భాగవతం పురాణార్కాయ’అని భాగవతాన్ని పురాణ భాస్కరుడిగా అభివర్ణించారు.
సమస్త వేద వాఙ్మయ రచయిత శ్రీల వ్యాసదేవుడే అయినా ఆ రచనలు ఆయనకే శాంతిని కలిగించలేకపోయాయి. తర్వాత తమ గురుదేవుడైన నారదముని ఆదేశంతో వ్యాసదేవుడు భాగవత రచన చేసి పరమశాంతిని పొందాడు. రచయితకే పరమానందం కలిగించిన భాగవతం మానవులందరికీ జీవితాలలో వెలుగులు నింపే పురాణ సూర్యుడు. మానవులకు దుఃఖాలు ఎందుకు కలుగుతున్నాయి? త్రివిధ తాపాలు ఎలా కలుగుతున్నాయి? వాటిని తొలగించుకోవడం ఎలా? పాపాలను పూర్తిగా శమింపజేసుకోవడం ఎలా? అనే విషయాలు తెలియకపోతే మనం చీకటిలో ఉన్నట్లే అవుతుంది. చీకటిలో ఉన్న మనకు చుట్టూ ఉన్న వస్తువులు కనిపించవు, ఎటువైపు వెళ్లాలో తెలియదు. ఏ ప్రమాదాలు పొంచి ఉన్నాయో తెలియదు. అందుకే చీకటి జీవితం అంతులేని భయాన్ని కలిగిస్తుంది. కానీ, భాగవత భాస్కరుడు శీఘ్రమే వెలుగులు ప్రసరించి దుఃఖాలను నశింపజేస్తాడు, సుఖాలను అందజేస్తాడు. అందుకే భాగవతాన్ని నిత్యం వినాలని, అధ్యయనం చేయాలని పెద్దలు చెప్పారు.
భాగవతం మానవులకు అందిస్తున్న ప్రత్యేక సందేశం ‘తపోమయ జీవనం’. జీవితంలో తపస్సు అనివార్యమైనది. మనిషి తపస్సు ద్వారా సమస్త దుఃఖాలను నశింపజేసుకుంటాడు. దుఃఖాలు కలగడానికి కారణం పాపాలు పేరుకొనిపోవడమే! తపస్సు ద్వారా పాపశమనం కలుగుతుంది. పాపాలు తొలగగానే దుఃఖాలు నశించిపోతాయి. ఇదే భాగవతం కురిపించే, తెలియజేసే దివ్యమైన వెలుగు! సృష్టికార్యం కోసం బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు, శ్రీకృష్ణుడినే పుత్రుడిగా పొందడానికి దేవకీవసుదేవులు తపస్సు చేశారు, ప్రజాసృష్టి చేయగలిగే శక్తి కొరకు దక్షప్రజాపతి తపస్సు చేశాడు. ఈ విధంగా భాగవతంలో అనేకమైన సందర్భాలు, సంఘటనలు తపోమహిమను మానవులకు తెలియజేస్తున్నాయి.
భక్త ధ్రువుడు తన పుణ్యపరిపాకాన్ని భోగాలను అనుభవించడం ద్వారా, పాపాలను తపస్సు ద్వారా పరిహరించుకున్నాడని భాగవతం స్పష్టంగా పలికింది. సుఖాలు కలుగుతున్నాయంటే పుణ్యం తరిగిపోతున్నదని అర్థం. దుఃఖాలు కలుగుతున్నాయంటే, కష్టాలు ఎదురవుతున్నాయంటే పాపం పండుతున్నదని సూచన. అందుకే భాగవత సందేశం ప్రకారం మనిషి నిరంతరం ఏదో ఒక తపస్సులో నెలకొనాలి. మనిషి మూడు రకాల తపస్సులు చేయాలి. అవి.. వాచిక తపస్సు, శారీరిక తపస్సు, మానసిక తపస్సు. మనిషికి అనారోగ్యం కలిగినప్పుడు వైద్యంలో లంఖణాలు చేయవలసివస్తుంది. ఆహారం తినలేకపోవడం రోగికి దుఃఖకరంగా అనిపిస్తుంది. కానీ, ఆరోగ్యంగా ఉన్నప్పుడే వారానికి, పక్షానికి ఒకరోజు ఉపవాసం చేస్తే అనారోగ్యం దరి చేరదు. ఉపవాసం చేయడం అంటే శారీరిక తపస్సేగా! అంతేకాదు, తపస్సు ద్వారా తపోశక్తి పెరిగి విజయాలు చేకూరుతాయి, ఫలితంగా సుఖప్రాప్తి కలుగుతుంది. ఈ విధమైన దివ్యసందేశాలతో జీవితంలో చీకట్లు తొలగించి వెలుగులు నింపేది కనుకనే భాగవతాన్ని పురాణ సూర్యుడిగా అభివర్ణించారు. నిత్యం భాగవత సేవ ద్వారా మానవులందరు సుఖశాంతులతో జీవించి కృష్ణప్రేమను పొందెదరు గాక!
డా॥ వైష్ణవాంఘ్రి
సేవక దాస్
98219 14642