e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home News అక్క నిలిపిన పానం

అక్క నిలిపిన పానం

సామాన్యుడి మాట
‘బిడ్డా.. నువ్వు నాకేం పంపకున్నా పర్లేదు గనీ, నువ్వయితే పానం జాగర్తగా కాపాడుకో.. నెలనెలా అస్తున్న కేసీఆర్‌ సార్‌ పైసలతోని మా బత్కుతా, నా గురించి రంది వెట్టుకోకు’ అని అమ్మ మధునమ్మ నేను ఫోన్జేసినప్పుడల్లా బుద్ధి మాటలు చెప్తా ఉంటే కేసీఆర్‌ కండ్లళ్ల కనవడ్తడు. 2010 ఎంబీఏ సదువుకుంటున్నప్పుడు కన్నారం గడ్డ మీద తెలంగాణ కోసం కొట్లాడింది యాదికొస్తుంటది. కేసీఆర్‌ మీద నమ్మిక.. అందుకే ఉద్యమ రోజుల్లో ఆయనెంబడే నడిచిన.

అక్క నిలిపిన పానం

నాపేరు జనగామ లక్ష్మణ్‌, నాది పెద్దపల్లి జిల్లా, ధర్మారం మండలంలోని గోపాల్‌రావుపేట. మా బాపు పేరు రామయ్య (నేను డిగ్రీల ఉండంగనే కాలం జేసిండు), మేం నేతకానోళ్లం. ఉన్నదొక్క ఎకురమే, అన్లేం పండుతయి, అందుకే అమ్మ కైకిలి వోయేది. అట్లా కట్టపడే అక్క పెండ్లి చేసింది. తమ్ముడు కూడా డిగ్రీ దాకా సదివిండు. ఎంబీఏ, బీఈడీ చేసిన నేను 2012 మే 24న పెండ్లి చేసుకున్న. మా ఇంటామె పేరు సుజాత. ఆమె కూడా బీటెక్‌ చేసింది. అందుకే ఇద్దరం తట్టా బుట్టా సదురుకొని పట్నంల వడ్డం. ఇద్దరికీ చిన్నపాటి కొలువులు కూడా దొరికినయి. ఇక్కడిదాన్క బాగనే ఉంది.

2014 అక్టోబర్‌.. ఓ రోజు ఆఫీసుకు వొయ్యి కంప్యూటర్‌ ముందు కూసుకున్నంక ఏం కనవడ్తలేదు. పక్కకున్న మనిషిని కూడా చూసిన, కొంచెం మస్క మస్క కొడ్తున్నడు. సైటచ్చిందేమో అనుకున్నా. కండ్ల పరీక్షలు చేస్తే అన్నీ మంచిగనే ఉన్నయన్నడు డాక్టరు. కొన్నొద్దులకు అన్నం తింటే అర్గుడు లేదు, తిన్నది తిన్నట్టు ఆవల వడుడే. ఓ ఐదారు దవాఖాన్లు తిర్గినగావొచ్చు, ఏడవోయిన డాక్టర్ల నోట ‘బాబూ.. నీ రెండు కిడ్నీలు కరాబైనయి, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేసుకోవాలె’ అన్న మాటే. ఓర్నీ ఇదేం గోసరా అయ్యా, తిప్పి తిప్పి కొడితే ముప్పై కూడా నిండలే. ఇప్పుడే కిడ్నీలు కరాబవుడేందో అర్థం కాలే. విషయం తెలిసి ఇంటోళ్లమందరం ఏడ్సినం. నాకు పెండ్లయి రెండేండ్లు కూడా నిండలె. నా ఇంటామె పరిస్థితి ఏంది అని ఓ రోజు నిండా శెద్దరి కప్పుకొని ఏడుస్తా ఉంటే పాపం ‘నీకు నేను లేనా బావ’ అని గుండెల మీద చెయ్యేసి నా బాధను పంచుకున్నది.

డయాలసిస్‌ చేసుకునుడు మొదలువెట్టిన. నాలుగ్గంటలు అదో నరకం కనవడేది. రెండేండ్ల పాటు నడిసింది డయాలసిస్‌. ఓ రోజు నా బాధ సూడలేక అమ్మ కిడ్నీ ఇస్తా అన్నది. పరీక్షలు చేసిన డాక్టర్లు అమ్మ కిడ్నీ నాకు పనికిరాదన్నరు. ఇగ నేను ఉరేసుకొనో, మందుతాగో సచ్చిందే నయ్యమనుకున్న.

అప్పుడొచ్చింది దేవత లెక్క మా అక్క. ‘తమ్మీ.. ఇద్దరం ఒక్క కడుపున పుట్టినోళ్లం కదా? దబ్బన నా కిడ్నీ పనికొస్తదో పరీక్షలు చేపియ్యిరా’ అన్నది. ‘అక్కా.. నేనే నూటొక్క తిప్పల వడ్తున్న, నువ్వెందుకే కిడ్నీ ఇచ్చుడు, నా సావేదో నేను సత్త తియ్‌’ అని సం దాయించిన. అస్సల్కే ఇన్లే. ఓ రోజు బావను తోల్కొనచ్చి నన్నే సందాయించిర్రు. ‘ఒక్క కిడ్నీతోని బతుకొచ్చు. అక్కకేం గాదు, ముందుగాళ్లయితే టెస్టులు చేపిద్దాంపా’ అని బావ దుర్గయ్య నన్నే ఓదార్చిండు. అందరం కలిసి డాక్టర్‌ దగ్గరికి వోయినం. అన్ని టెస్టు లు చేపిస్తే అక్క కిడ్నీ నాకు సరిపోద్దని డాక్టర్లు చెప్పి ర్రు. అక్క ఒక్క నిమిషం కూడా ఆలోచించలె,

‘సారూ.. నేను ఆపరేషన్‌కు రెడీ’ అని డాక్టర్లతోని చెప్పిందక్క. డాక్టర్లు ఏడ దస్కత్‌ పెట్టుమంటే ఆన్నే పెట్టిండు బావ. ఆ రోజు వాళ్లిద్దర్ని సూత్తె శివపార్వతులే కనవడ్డరనుకోర్రి. 2017 మార్చి 28 రోజున నాకు ఆపరేషన్‌ జరిగి, సక్సెసయింది. నేను మళ్లా పుట్టినట్టే. అక్క శ్యామలే నాకు మళ్లా జీవం పోసింది. ఈ రోజు నేనింకా బతికి ఉన్ననంటే కారణం అక్కే..

ఇదంతా బాగనే ఉన్నా మళ్లో చిక్కచ్చిపడింది. అక్క కిడ్నీ నాకు అక్కెరకొస్తదనుకున్నా.. ఆపరేషన్‌ కర్సు పది లక్షల రూపాలైతయని చెప్పిర్రు డాక్టర్లు. వాటికేడికి పోవాల్నో అర్థంగాలె. ఉన్న ఎకురం భూమి అమ్మంగొచ్చిన పైసలు దవాఖాన్లనే కుమ్మరిచ్చిన. అమ్మకు ఆధారం ఆ ఎకురం భూమే. దాన్ని అమ్మడానిగ్గూడా అమ్మ ఎనుకకువోలె. ‘నీ కంటే ఎక్కువనా బిడ్డ నాకు భూమి’ అన్నది. కండ్లు ఎర్రగై వటవటా గారినయి నీళ్లు. నా ఏడుపు సూత్తె అమ్మ ఎక్కడ బెంగటిల్తదోనని ఆ కన్నీళ్లను దిగమింగుకున్న.

పెండ్లయినంక రెండేండ్లకే కిడ్నీ సమస్య బయటవడ్డది. అయినా సుజాత నన్నిడిసిపెట్టి పోలె. ఆపత్కా లంల ఎంబడే ఉన్నది. ఆపరేషనై దగ్గెర దగ్గెర నాలుగేండ్లయితున్నది. నన్ను చంటిపిల్లగాని కన్న ఎక్కువ చూస్కుంటది. ఇటున్న పుల్ల అటు వెట్టనియ్యది. ఆపరేషన్‌ అయిన కొత్తల నెలకు 20 వేలయ్యేటియి మం దుగోలీలకు. ఇట్లా జీతం పడుడు ఆల్ష్యం లేదు, అట్లా మందుగోలీలు తెస్తుండె సుజాత. ఇప్పుడు నెలకు 9 వేలయితున్నయి. ఇప్పటికీ నా కోసమే కొలువు జేస్తది. కరోనా కారణంగా రెండేండ్లాయె నన్ను ఇంట్లకెల్లి కాలు బయటవెట్టనియ్యక.

2019 ఫిబ్రవరి 11న మాకు బిడ్డ పుట్టింది. మా ఇద్దరి ప్రేమకు గుర్తు మా బిడ్డ చేతన. ప్రభుత్వ దవాఖాన్లనే పుట్టింది. రూ.13 వేలు కూడా అచ్చినయి. ఇప్పటికీ కేసీఆర్‌ తాతిచ్చిన బొమ్మేది? అని ‘కేసీఆర్‌ కిట్‌’నే గుర్తుచేస్తది. చేతన కోసం.. అమ్మ కోసం.. సుజాత కోసం.. నాల్గొద్దులు బత్కబుద్దయితున్నది. సుజాతొక్కతే చేస్తే ఎల్తదా సంసారం? అటు ఇంటి కిరాయి, ఇటు మందుల కర్సు కట్టం కదా? అందుకే నాక్కూడా ఇంటిపట్టున ఉండి చేస్కునేందుకు ఓ పని సూపెట్టాలె. నా అసొంటోళ్లగ్గూడా నెలా నెలా పింఛన్‌ ఇస్తే మంచిగుంటది. కేసీఆర్‌ సార్‌ దయగళ్లోడు. అందరికీ మంచి చేస్తడనే నమ్మకమైతే నాకున్నది.

  • గడ్డం సతీష్‌, 99590 59041
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అక్క నిలిపిన పానం

ట్రెండింగ్‌

Advertisement