‘అమ్మా! నాకు చలి వేస్తోందే.. మంట వేయవూ? నాయనా.. బొగ్గులు లేవురా. అమ్మా! బొగ్గులెందుకు లేవే? మీ నాన్నకు పనిపోయింది బిడ్డా! బొగ్గులు కొనడానికి డబ్బు లేదు బాబూ. నాన్నకు పనెందుకు పోయిందమ్మా? బొగ్గు ఎక్కువగా ఉందిటరా బాబూ!’ ఇది రాక్షసి బొగ్గు నవలలో ఓ సన్నివేశం. బొగ్గు ఉత్పత్తి ఎక్కువైందని కార్మికులను తీసేస్తే.. ఆ బొగ్గు లేకనే కార్మికులు చలికి వణుకుతూ చనిపోయే దుస్థితి ఏర్పడటం పాలకుల అపసవ్య విధానాలకు నిదర్శనం. సరిగ్గా మన కేంద్ర ప్రభుత్వ ధోరణి కూడా అలాగే ఉన్నది.
ప్రైవేటు సంస్థలు భవిష్యత్తులో కృత్రిమంగా బొగ్గు కొరత సృష్టించే అవకాశం ఉన్నది. దానితో బొగ్గు ధరలు, విద్యుత్తు వినియోగ ధరలు పెరిగి ప్రజల మీద మోయలేని భారం పడే ప్రమాదం ఉన్నది. బీజేపీ ప్రభుత్వం సహజ వనరులను, ప్రభుత్వ పరిశ్రమలను అమ్మకానికి పెడుతున్నది. 2021-22 నుంచి 2024-25 నాటికి ప్రభుత్వ ఆస్తులన్నింటినీ అమ్మి రూ.6 లక్షల కోట్లు సమీకరించుకుంటామని ప్రకటించింది!
2021 అక్టోబర్ 10న బొగ్గు లభ్యత, విద్యుత్ డిమాండ్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, విద్యుత్‌శాఖ మంత్రి రాజ్‌కుమార్‌సింగ్ సమావేశమై చర్చించారు. దేశంలోని 135 థర్మల్ విద్యుత్ కేంద్రాలు బొగ్గు కొరత ఎదుర్కొంటున్నాయి. కొన్ని మూత పడే స్థితికి చేరుకున్నాయి. బొగ్గు కొరతపై వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు కూడా కేంద్రానికి లేఖలు రాశారు. ఈ పరిస్థితి ఇలా ఉండగానే.. అక్టోబర్ 11న కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ బొగ్గు గనుల వేలంపై ప్రకటన జారీచేసింది. కోల్‌మైన్స్ స్పెషల్ ప్రొవిజన్ యాక్ట్-2015, మైన్స్ మినరల్స్ (డెవలప్ మెంట్ రెగ్యులేషన్) యాక్ట్ 1957 మార్గదర్శకంగా.. దేశవ్యాప్తంగా 88 బొగ్గు బ్లాక్‌లను వేలం వేస్తున్నట్లుగా తెలిపింది. అందులో జార్ఖండ్, ఒడిషా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, అసోం, ఆంధ్రప్రదేశ్, రాష్ర్టాల్లోని బ్లాక్‌లతో పాటు గా తెలంగాణలోని సింగరేణి కంపెనీకి చెందిన నాలుగు గనులు కూడా ఉన్నాయి.
సింగరేణి సంస్థ రూ.66 కోట్లు వెచ్చించి భూగ ర్భ పరిశోధన పూర్తిచేసింది. పర్యావరణ అనుమతులను పొందిన వెంటనే బొగ్గు తవ్వకాలకు సిద్ధం చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోయగూడెం బ్లాక్-3, ఖమ్మం జిల్లా సత్తుపల్లి బ్లాక్-3, మంచిర్యాల జిల్లా కళ్యాణ్ ఖని బ్లాక్-6, శ్రావణ్‌పల్లి బ్లాక్ కూడా ఉన్నవి. అయితే కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం ప్రక్రియను ప్రకటించడంతో సింగరేణిలో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
కార్మిక సంఘాలు బొగ్గు గనుల వేలం పాటను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ సంస్థల ద్వారానే బొగ్గు ఉత్పత్తి పనులను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభు త్వం మాత్రం ఓపెన్ బిడ్డింగ్ ప్రాతిపదికగానే బొగ్గు గనుల కేటాయింపునకు మొగ్గు చూపుతున్నది. దానివల్ల ప్రభుత్వ సంస్థలైన కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్), సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)లు కూడా వేలంపాటలో పాల్గొ ని బొగ్గు గనులను దక్కించుకోవాలి!
ప్రపంచంలో అత్యధిక బొగ్గు నిల్వలున్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. 2018 ఏప్రిల్ 1 నాటి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు భూగర్భంలో 1200 మీటర్ల లోతు వరకు జరిపిన అన్వేషణ ప్రకారం 31,902 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో సీఐఎల్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లు 64,7,017 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేశాయి. ప్రైవేట్ కంపెనీలు 24,280 మిలియన్ టన్నుల బొగ్గును మాత్రమే ఉత్పత్తి చేశాయి. దేశంలో అపారమైన బొగ్గు నిల్వలున్నప్పటికీ దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచుకోవడానికి కేంద్రం కృషిచేయలేదు. బొగ్గు సంస్థలకు కనీసం పన్నుల చెల్లింపులో రాయితీనివ్వడం లేదు. కానీ సీఐఎల్.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వివిధ పన్నుల పేర రూ.44,07,581 కోట్లు కేంద్రానికి చెల్లించింది. కార్పొరేట్ సోషల్ రెస్పా న్స్బిలిటీ పేర రూ.44,931 కోట్లు చెల్లించింది. నికర లాభాలుగా రూ.12,70,217 కోట్లు సాధించింది. సింగరేణి కంపెనీ 2014-15 నుంచి 2018-19 వరకు రూ 27,46,771 కోట్లు, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ పేర 2018 ఏప్రిల్ నుంచి 2020 ఆగస్టు వరకు రూ2, 26,285 కోట్లు చెల్లించింది. సీఎస్ఆర్ పేర 2020-21లో రూ.20 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ బొగ్గు ఉత్పత్తిసంస్థలు లాభాలతో, స్వయంకృషితో ఉత్ప త్తి లక్ష్యాలను అధిగమించి పారిశ్రామికాభివృద్ధికి, విద్యుత్ ఉత్పత్తికి తోడ్పడుతున్నవి.
దేశీయంగా బొగ్గు కొరత ఉన్నప్పటికీ పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్‌లకు 8 లక్షల టన్నుల బొగ్గును కేంద్రం ఎగుమతి చేసింది. ప్రస్తుత బొగ్గు కొరతకు కారణం.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం, ప్రైవేటుపరం చేయటంగా చెప్పుకోవచ్చు. స్వయంగా సీఐఎల్ చైర్మన్ బొగ్గు ఉత్పత్తిని తగ్గించాలంటూ తీవ్రమైన ఒత్తిడి వచ్చిందని చెప్పిన మాటలే సాక్ష్యం.
అయితే బొగ్గు గనులను అమ్మే విషయంలో మాత్రం కార్మిక వ్యతిరేకత రాకుండా కేంద్రం జాగ్రత్తగా వ్యవహరిస్తున్నది. బొగ్గు కొరత పేరుతో 88 బొగ్గు బ్లాకులను వేలంపాటలో అమ్మడానికి ప్రయత్నిస్తున్నది. ఇలాంటి చర్యలతో దేశం తీవ్ర విద్యుత్ కొరతతో అల్లాడే పరిస్థితి వస్తుంది. ప్రజలపై పెనుభారంగా మారే ప్రమాదం పొంచి ఉన్నది. కాబట్టి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలంతా ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది.
(వ్యాసకర్త: సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కార్యదర్శి)
మేరుగు రాజయ్య
94414 40791