‘ఇదే గ్లాస్గోలో 250 ఏండ్ల కిందట జేమ్స్ వాట్ బొగ్గును మండించడం ద్వారా పనిచేసే ఆవిరి యంత్రాన్ని కనుగొన్నాడు. ఇప్పుడు ప్రళయ యంత్రం మొదలైన అదే చోటికి మిమ్మల్ని తీసుకొచ్చాం’ అంటూ బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ సోమవారం కాప్ 26 సదస్సును ప్రారంభిస్తూ హెచ్చరించారు. జేమ్స్ వాట్ ఆవిరి యంత్రాన్ని కనుగొన్న తరువాత పారిశ్రామిక విప్లవం ప్రభవించింది. మానవాళికి ఎంతో మేలు చేసిన ఈ విప్లవం క్రమంగా ప్రకృతి విధ్వంసాని దారితీసింది. భూతాపం పెంచడం ద్వారా మానవాళి వినాశనానికి దారి తీస్తుందనే భయాందోళనలు తీవ్రమయ్యాయి. కర్బన ఉద్గారాలను అరికట్టడానికి ఆరేండ్ల కిందట ప్యారిస్ ఒడంబడిక కుదిరినా ఆ తరువాత ఆశించిన ప్రగతి జరగలేదు. రెండేండ్ల క్రితం మాడ్రిడ్లో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు కాప్-25 ఘోరంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో గ్లాస్గోలో రెండు వారాల పాటు జరిగే ఈ సదస్సులోనైనా వివిధ దేశాల నాయకులు విజ్ఞతతో వ్యవహరిస్తారా అనే ఆసక్తి వ్యక్తమవుతున్నది.
అమెరికా అధ్యక్షుడు బైడెన్, భారత ప్రధాని మోదీ మొదలుకొని వందకు పైగా దేశ నాయకులు ఈ సదస్సుకు హాజరవుతున్న నేపథ్యంలో ఏ కొంత పురోగతి సాధించినా చాలనే ఆశ మొలకెత్తుతున్నది. కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించుకోవడాన్ని ఇప్పుడే ప్రారంభించినా కూడా భూగోళం ఉష్ణోగ్రతలు వచ్చే 20 ఏండ్లలో 1.5 డిగ్రీల సెల్సియస్ మేర పెరగనున్నాయని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. ఈ నేపథ్యంలోనైనా ప్రపంచ నాయకులు భూగోళంపై మానవాళి వినాశనానికి దారి తీసే విధానాలను కట్టడి చేయాలి. పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యంపై ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో స్పృహ పెరిగింది. దీనివల్ల ఆయా దేశాల నాయకులపై ఒత్తిడి పెరిగింది. ఈ ఒత్తిడి వల్ల పారిశ్రామిక దేశాల నాయకులు మొక్కుబడిగా చర్చలు జరుపుతున్నారే తప్ప, వారిలో చిత్తశుద్ధి కనిపించడం లేదు.
భూగోళ తాపం పెరగడానికి, పర్యావరణ విధ్వంసం జరగడానికి ఇప్పటి వరకు పాశ్చాత్య దేశాలలో సాగిన విధ్వంసకర పారిశ్రామిక విధానాలే కారణం. వర్ధమాన దేశాలలో ఇప్పుడిప్పుడే పారిశ్రామికీకరణ సాగుతున్నది. కానీ కర్బన ఉద్గారాల కట్టడి విషయంలో మాత్రం భారత్ వంటి వర్ధమాన దేశాలకూ సమాన బాధ్యత ఉండాలని బడా దేశాలు పేర్కొనడం సబబు కాదు. పైగా పర్యావరణ హితమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వర్ధమాన దేశాలకు బదిలీ చేయడానికి నిరాకరిస్తూ, ఇక్కడి అభివృద్ధిని కట్టడి చేయడం కూడా సరికాదు. భూగోళ తాపం పెరుగడం వల్ల అందరికీ హానికరమే. కర్బన ఉద్గారాల కట్టడికి వర్ధమానదేశాలు కూడా తమవంతు కృషి చేయవలసిందే. అయితే తమపై మరింత బాధ్యత ఉంటుందని పారిశ్రామిక దేశాల నాయకులు గ్రహించాలి.