లొట్టి కల్లు, ముంత నీరా, నాలుగు సీకులు, డొప్పెడు నల్లా, వారాకు నాలుగు మోత్కాకులు (వారాకు). ఇది ఏ కల్లు మండువలోనో వినిపించే మాటలు కాదు. ఆన్లైన్లో కల్లు ఆర్డర్ చేస్తే ప్యాకేజీలో ఎంచుకోబోయే మెనూలో కనిపించే ఐటమ్స్. కల్లు ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చా అని అప్పుడే ప్రశ్నించకండి. దీనివెనుక కొంత ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ ఉంది కాస్త ఆగండి. గీత కార్మికుడు ఒకరు జొమాటో టీ షర్టు ధరించి సైకిల్‌పై కల్లు లొట్టి, మోకు, ముస్తాదుతో వెళ్తున్న ఫొటోను ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో కల్లును ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చా అని కల్లు ప్రియులు నెట్లో శోధిస్తున్నారట. వాస్తవానికి కల్లు ఆన్లైన్లో ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. కానీ జొమాటో టీషర్ట్ ధరించిన ఆ గీత కార్మికుడి ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కల్లు ప్యాకేజీగా రకరకాల మెనూలను సూచిస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆన్లైన్లో కల్లుకు గిరాకీ బాగానే ఉన్నట్టుంది. కల్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఇది చూసైనా కనీసం నీరా అయినా ఆన్‌లైన్‌లోకి తీసుకరండి బిజినెస్ బాగానే ఉంటుందని నెటిజన్లు సూచిస్తున్నారు.
–వెల్జాల