తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితే పవర్ కట్లు, కంపెనీలు మూత పడతయి అన్నవాళ్లు.. ఇప్పుడు తెలంగాణ పెట్టుబడులకు అనువైన ప్రదేశమని, అనుకూల ప్రాంతమని కొనియాడుతున్నరు. శాంతి భద్రతలుండవు, అభివృద్ధి అసలే ముందుకుసాగదన్న వాళ్లకు ఇదొక ‘మూ-తోడ్’ జవాబ్. ఉన్న కంపెనీలు తిరిగి వెళ్లిపోతాయనేది కాస్త.. పెడితే పెట్టుబడులు, పరిశ్రమలు తెలంగాణలనే పెట్టాలని బడా కంపెనీలు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నాయి. తాజాగా వారం రోజుల కేటీఆర్ అమెరికా పర్యటన సఫలతను చెప్పుకోవచ్చు.
రాష్ట్ర అవతరణ తర్వాత 35 ప్రపంచస్థాయి కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. ఐటీ అంటే మాదాపూర్, గచ్చిబౌలే కాదు. తెలంగాణ అంటే ఐటీ అనేలా తయారైంది. గ్రిడ్ పాలసీ ద్వారా ఐటీ రంగం విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి పట్టణాల్లో కూడా ఐటీ సంస్థలు ఏర్పాటయ్యాయి.
తెలంగాణ రాష్ట్రం ఇప్పుడొక ట్రెండ్ సెట్టర్. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ పాలనాదక్షతకు తోడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవ ఈ ఆధునిక అభివృద్ధి అంతటికీ మూలం. ఇప్పటిదాకా ఐటీ కంపెనీలన్నీ మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, నానక్‌రామ్‌గూడ వంటి ప్రాం తాల్లోనే ఉన్నాయి. రానున్న రోజుల్లో పోచారం, కొంపల్లి, ఉప్పల్, ఘట్కేసర్, శంషాబాద్ ఇలా నగ రం చుట్టూ ఐటీని విస్తరింపజేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో 3 లక్షల ఐటీ ఉద్యోగాలు, 56 వేల కోట్ల విలువైన ఐటీ ఎగుమతులుండేవి. ఆ తర్వాతికాలంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్విరామ కృషి తో ఉద్యోగాలు, ఎగుమతులు రెట్టింపయ్యాయి. ఇప్పుడు 7 లక్షల ఐటీ ఉద్యోగాలతో పాటు లక్షా 50 వేల కోట్ల ఎగుమతులు చేయగలుగుతున్నాం. ఐటీ సంస్థలకు తెలంగాణ సెకండ్ హెడ్‌క్వార్టర్‌గా మారిపోయింది. భారీ పెట్టుబడులకు అనువైన ప్రదేశంగా విలసిల్లుతున్నది. పరిశ్రమల స్థాపనకు స్వర్గధామమైంది. బహుళజాతి సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఐటీ రం గం ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించడం వల్ల స్థానిక గ్రామాల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తున్నది.
దేశ విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోని అన్ని రాష్ర్టాల కన్నా ముందున్నది. దీనికి కారణం మనం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానమే. భాగ్యనగర అభివృద్ధిలో ‘విశ్వ’రూపం చూపుతున్నది. ప్రపంచం మెచ్చిన గమ్యస్థానంగా నిలిచి పెట్టుబడులు, ఉపాధి కల్పనలో ముందున్నది. దేశంలోనే హైదరాబాద్ నగరం ఐటీ రంగానికి కీలక స్థానంగా ఉంది. ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్, బయో ఏషియా సదస్సులు తెలంగాణ కీర్తిని విశ్వవాప్తం చేశాయి. 35 ప్రపంచస్థాయి కంపెనీలు, 15 వేలకు పైగాపరిశ్రమలు, 15 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, రెండు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు.. ఇదంతా కేవలం ఏడేండ్లలో సాధించిన ప్రగతి.
రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణ సర్కారు అందిస్తున్న ప్రోత్సాహకాలు, అమలుచేస్తున్న సరళతర విధానాలతో పెట్టుబడుల రాకలో వేగం పుంజుకున్నది. ఫలితంగా 2014-15 నుంచి క్రమంగా వృద్ధిని సాధిస్తూ.. 2020-21లోనే రూ.2.16 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. టీ-హబ్, ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా 2015 నుంచి ఇప్పటిదాకా 1,100 స్టార్టప్‌లు, రూ.2 వేల కోట్ల పెట్టుబడులను సమీకరించటం తెలంగాణ ఐటీ, పారిశ్రామిక అభివృద్ధికి తార్కాణంగా చెప్పవచ్చు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఈ మధ్యనే కేటీఆర్ చేసిన అమెరికా వారం రోజుల పర్యటన విజయవంతమైంది. దాదాపు అక్కడ 35 వాణి జ్య సమావేశాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఫార్మా, ఐటీ రంగ దిగ్గజాలతో సమావేశంలో పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణలో ఉన్న వనరులు, అవకాశాల గురించి వివరిం చి సఫలమయ్యారు. ఫలితంగా రూ.7,500 కోట్ల పెట్టుబడులు రాష్ర్టానికి రానుండటం హర్షణీయం.
–(వ్యాసకర్త: ఫ్రీలాన్స్ జర్నలిస్టు ఫిల్మ్ మేకర్)
దేశ విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోని అన్ని రాష్ర్టాల కన్నా ముందున్నది. దీనికి కారణం మనం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానమే. భాగ్యనగర అభివృద్ధిలో ‘విశ్వ’రూపం చూపుతున్నది. ప్రపంచం మెచ్చిన గమ్యస్థానంగా నిలిచి పెట్టుబడులు, ఉపాధి కల్పనలో ముందున్నది. దేశంలోనే హైదరాబాద్ నగరం ఐటీ రంగానికి కీలక స్థానంగా ఉంది.
అజహర్ షేక్99634 22160