నీకు తెలియకుండా
నిన్ను ముట్టుకోకుండా
నీ కంటికి కనబడకుండా
నీ శ్రమకు చిల్లు పెడుతున్నాడొకడు..
నిలువెత్తుగా నిలబడి
కళ్లప్పగించి
నువ్వు చూస్తున్నా సరే
మాయావస్ర్తాన్ని నీపై కప్పి
మంత్రదండం
విసురుతున్నాడు చూడు
మార్కెట్ జూదంలో
ధర్మసుంకం పాచికలు
నిన్ను నడి సంద్రంలో
తూస్తున్నాయి తెలుసుకో..
నువ్వు నిలబడ్డ నావలోకి
నీళ్లొస్తున్నాయి గమనించు
నీ బతుకు బొక్క బోర్లా
పడే సమయం
ఆసన్నమైందని తెలియకుండానే
నువ్వు చేజారిపోతున్నావు చూసుకో
నీ పక్కనే సూటూ బూటేసుకొని
దర్జాగా నిలబడ్డోడు
నీ జేబును కత్తిరించి
ఉడాయిస్తుంటే తెల్వదా..
సమస్యల వరదలో
కాగితప్పడవలా
కొట్టుకుపోతున్న బక్క జీవి
ఏదో ముల్లు
నిన్ను ఛిద్రం చేస్తుంటే
గమ్మునుంటావా..
అమాయకుడా..
నీ వెన్నుపూస విరిచాక
నీ నడక ప్రశ్నార్థకమే..!
-డాక్టర్ కటుకోఝ్వల రమేష్
99490 83327