అంతేనేమో
ఎదుటివాడిపైనే
నేటి సూటిపోటితనం
ఉద్ధరిస్తున్నానన్న భావనతో
అంతా కలుషితం చేయడం
అన్నింట్లో కాలెట్టి
నేనే అనే అహంభావం తలకెత్తుకోవడం నైజం
వాడి వీపో సారి చూసుకోలేని తనం
వాడి కంట్లో నలుసు చూసుకోలేని, తీసుకోలేక
పరాయివాడితో వాదులాడటం
నోరుకు కళ్లెం తెంపుకొని
అడ్డదిడ్డాన్నంతా కక్కేయడం
అన్నింటా నేనే అంటూ
వెంపర్లాడుతూ
బురదను చిట్లిస్తుంటడు
వాడి పనిని మరిచి
అరచి గిల్లి కజ్జాలతో
అల్లకల్లోలం సృష్టిస్తుంటడు
బుడంకాయల దొంగల
భుజాల్ని తడిమి
మిడిసి పడుతూ
తన స్థాయిని మరిచి
దిగజారుడుతనాన్ని
అలంకరించుకుంటడు
చిట్టచివరికి రచ్చ చేసూత
ఎదుటోడిపై విషాన్నెల్లగక్కుతూ
ఒంటరైపోతుంటడు నేటి తలపొగరు మనిషి
బుద్ధికి సైతం అవిటితనాన్ని అద్దుకొని
నడత నడవడిక మరిచి
నారదునిలా లోలోపల
నవ్వులు ఒలకబోసి బోసితనంతో
బైలెల్లుతున్న భయంకర మనస్తత్వం
నడిచే నావకు చిల్లులు బొడిచి
అల్లకల్లోలానికి వారసులౌతున్న వైనం
చేవచచ్చినా పులుపు చావదన్నట్లు
పుట్టుకతో వచ్చిన బుద్ధి సచ్చేదాకా మారదాయే
అదంతేనేమో…
-సి.శేఖర్ (సీఎస్ఆర్)
90104 80557