Dune 3 Trailer | ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘డ్యూన్: పార్ట్ త్రీ’ (Dune: Part Three) అధికారిక టీజర్ ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దర్శకుడు డెనిస్ విల్లెనూవ్ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రం ఫ్రాంక్ హెర్బర్ట్ రాసిన ‘డ్యూన్ మెస్సయ్య’ (Dune Messiah) నవల ఆధారంగా రాబోతుంది. ఈ చిత్రంలో పాల్ అట్రిడెస్ ప్రయాణం రెండో భాగం ముగిసిన చోటు నుండే ప్రారంభం కాబోతుండగా.. చక్రవర్తిగా బాధ్యతలు చేపట్టిన పాల్ (తిమోతీ చాలమెట్) తన అధికారాన్ని ఎలా నిలబెట్టుకుంటాడు, విశ్వవ్యాప్తంగా తలెత్తే భీకర యుద్ధాలను ఎలా ఎదుర్కొంటాడు అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా రూపొందుతోంది. టీజర్లో చూపించిన విజువల్స్ అత్యద్భుతంగా ఉండటమే కాకుండా, అరాకిస్ గ్రహంపై జరిగే యుద్ధ సన్నివేశాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. తిమోతీ చాలమెట్తో పాటు జెండయా, ఫ్లోరెన్స్ పగ్, అన్యా టేలర్-జోయ్ వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో కనిపిస్తుండగా, హన్స్ జిమ్మెర్ అందించిన నేపథ్య సంగీతం టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. హాలీవుడ్ సెన్సేషన్‌గా మారిన ఈ టీజర్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మరో సునామీ రాబోతుందనే సంకేతాలను ఇస్తోంది.