Drunk auto driver : సాధారణంగా సినిమాల్లో కమెడియన్లు ఏదో చేయబోతే మరేదో జరుగుతుంది. అలాంటి ఘటనలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి. తాజాగా తమిళనాడులో ఓ తాగుబోతు ఆటోడ్రైవర్ తన రియల్ లైఫ్లో చేసిన పని కూడా అచ్చం అలాంటి కామెడీనే పండించింది. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో మహిళా కానిస్టేబుల్ను తనతో తీసుకెళ్లాడు. దాంతో తగిన మూల్యం చెల్లించుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాజధాని చెన్నైలోని మైలాపూర్ ఏరియాలోగల కపిలీశ్వరార్ ఆలయం సమీపంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఫూటుగా మద్యం సేవించి అటుగా వచ్చిన ఓ ఆటో డ్రైవర్ పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. మహిళా కానిస్టేబుల్ లావణ్య అతడి ఆటోకు అడ్డం తిరగడంతో వాహనం ఆపకుండా వేగంగా పోనిచ్చాడు.
దాంతో ఆ మహిళా కానిస్టేబుల్ చాకచక్యంగా పక్కకు తప్పుకుని ఆటోలోకి దూకింది. అయితే తాగిన మత్తులో ఉన్న ఆటో డ్రైవర్ కొంతదూరం వెళ్లేదాక కూడా తన ఆటోలో మహిళా కానిస్టేబుల్ ఉన్న విషయాన్ని గమనించలేదు. చివరికి మహిళా కానిస్టేబుల్ను చూసి కంగుతిన్న ఆటో డ్రైవర్.. కుక్కిన పేనులా ఆమెను తీసుకుని వచ్చి చెకింగ్ పాయింట్ దగ్గర దించాడు.
పోలీసులు అతడికి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయగా మద్యం మత్తులో ఉన్నట్లు తేలింది. మద్యం మత్తులో ఉండటం, పైగా పోలీసుల పైనుంచే వాహనాన్ని పోనిచ్చేందుకు పూనుకోవడం లాంటి ఘటనల నేపథ్యంలో అతడికి ఏకంగా రూ.10 వేల జరిమానా విధించారు. దాంతో సినిమాల్లో కమెడియన్ల మాదిరిగా రియల్ లైఫ్లో కంగుతినడం ఆ ఆటో డ్రైవర్ వంతయ్యింది.