అమీర్‌పేట్, నవంబర్ 17: శారీరక శ్రమలేని ఆధునిక జీవనశైలి, పాశ్చాత్య ఆహార అలవాట్లే అన్ని ఆరోగ్య సమస్యలకు కారణమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సూర్యరశ్మి చొరబడని నివాసాలు, ఆఫీసులు.. ప్రజలను అనారోగ్యం పాల్జేస్తున్నాయన్నారు. అమెరికాలో అత్యున్నత ప్రమాణాలతో మూడు డయాగ్నస్టిక్ సెంటర్లతోపాటు పలు ఐటీ కంపెనీలను నిర్వహిస్తున్న సుధాకర్ కంచర్ల.. హైదరాబాద్‌లో ‘యోధా లైఫ్‌లైన్’ పేరుతో ఏర్పాటు చేసిన నూతన డయాగ్నస్టిక్స్‌ను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యపరీక్షా కేంద్రాలు పూర్తి వ్యాపారాత్మక ధోరణితో కాకుండా కొంతైనా సేవాభావంతో వ్యవహరించాలని కోరారు.
దేశంలో రాజకీయ సంస్కరణలు జరగాలని వెంకయ్యనాయుడు ఆశించారు. ప్రస్తుతం తాను రాజకీయాల్లో లేకపోయినా ఆసక్తి తగ్గిపోయిందని తెలిపారు. ప్రస్తుత రాజకీయాలు ఇంతకు ముందున్నంత ఆరోగ్యకరంగా లేవని, పరిస్థితులను చూస్తుంటే బాధేస్తున్నదని చెప్పారు. చట్టసభల్లో కొందరు ప్రయోగించే భాష బాధాకరంగా ఉంటున్నదన్నారు. జనంతో కలిసి మెలిసి పనిచేసినప్పుడు కలిగినంత సంతోషం రాజ్యాంగ పదవిలో లభించడంలేదని చెప్పారు. ప్రొటోకాల్ నేపథ్యంలో తన వ్యక్తిగత పనులు, అభిరుచులను నియంత్రించుకోవాల్సి వస్తున్నదన్నారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, సినీ దర్శకుడు కే రాఘవేంద్రరావు, సినీనటుడు చిరంజీవి, మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, ప్రముఖ చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక పాల్గొన్నారు. అనంతరం వెంకయ్యనాయుడు చేతుల మీదుగా యోధా లైఫ్‌లైన్ సీఈవో సుధాకర్ కంచర్ల రూ.25 లక్షల చెక్కును చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు అందజేశారు.