భారతదేశంలోని విద్యా సంస్థల్లో లైంగిక విద్య ఇంకా మొక్కుబడిగానే సాగిపోతున్నది. ఉపాధ్యాయులు కూడా తటపటాయిస్తూనే బోధిస్తున్నారు. ఈ పరిస్థితికి సవాలు విసురుతూ డాక్టర్ తనయా నరేంద్ర ‘డాక్టర్ క్యుటెరస్: ఎవ్రీథింగ్ నోబడీ టెల్స్ యు ఎబౌట్ యువర్ బాడీ’ అనే పుస్తకం రచించింది. పెంగ్విన్ ప్రచురణ ఇది. స్త్రీ, పురుషుల లైంగికతకు సంబంధించి అనేక అంశాలను ఇందులో చర్చించింది.
మానవ శరీరం, అబార్షన్లు, కుటుంబ నియంత్రణ, లైంగిక వ్యాధుల గురించి లోతుగా వివరించింది. మరీ సీరియస్గా కాకుండా హాస్యాన్ని మేళవించడం డా.క్యుటెరస్ ప్రత్యేకత. ఫెర్టిలిటీ ట్రీట్మెంట్లో మాస్టర్స్ చేసింది తనయా నరేంద్ర. ఆమె తల్లిదండ్రులు కూడా వైద్యులే. ట్రాన్స్ జెండర్లు, స్త్రీవాదం తదితర అంశాలను కూడా వదిలిపెట్టలేదు.
కాస్మెటిక్స్ వెనక ఉన్న పెట్టుబడిదారితనం, మార్కెట్ వ్యూహాలనూ విశ్లేషించింది. ‘తరతరాలుగా మహిళల లైంగిక ఆరోగ్యం నిర్లక్ష్యానికి గురైంది. ఆ పరిస్థితి పోవాలి. ఈ పుస్తకం టీనేజీకి అత్యవసరమైంది. పెద్దలు నేర్చుకోవాల్సింది కూడా చాలానే ఉంది’ అంటుంది డాక్టర్ తనయ.