సమయం.. ఉదయం ఎనిమిది గంటలు. ఆపరేషన్ గది బయట లైటు వెలిగింది. హార్ట్ మానిటర్ చప్పుడు స్పష్టంగా సెకండ్లను లెక్కపెడుతున్నట్టు వినిపిస్తున్నది. ఎమర్జెన్సీ సర్జరీకి సరంజామా సిద్ధమైంది. వీటన్నిటితో పోటీ పడుతూ చకచకా చేతులు కదుపుతున్నదో వైద్యురాలు. అన్నిటికన్నా అక్కడ ఆమే ప్రత్యేకం. ఎందుకంటే ఆమె వైద్యానికి షష్టి పూర్తి నిండింది. ఆమె వయసు 92 దాటింది. మూడు తరాలకు పురుడు పోసి పుణ్యం కట్టుకున్న ఆమే పేదల వైద్యురాలిగా పేరున్న హైదరాబాద్‌కి చెందిన గైనకాలజిస్టు డాక్టర్ సూరి శ్రీమతి! తన సుదీర్ఘ జీవన ప్రయాణాన్ని, దాన్ని సాధించే రహస్యాల్ని అందరికోసం జిందగీతో పంచుకున్నారు.
ఇన్ని సంవత్సరాలుగా వైద్యం ఎలా చేస్తున్నారు అని అడుగుతుంటారు చాలామంది. వయసైపోయింది అని తినడం మానేయలేదే. మరి మనకొచ్చిన పని మాత్రం ఎందుకు మానేయాలి? చక్కగా మూడు పూటలా తింటున్నది అరుగుతున్నప్పుడు ఊరికే కూర్చొని ఉండాలని ఎందుకు కోరుకోవాలి? నేను భగవంతుణ్ని, ముఖ్యంగా సత్యసాయిబాబాను చాలా నమ్ముతాను. వైద్యం దేవుడు చేస్తాడు. క్రెడిట్ డాక్టర్ తీసుకుంటారు అని అనుకుంటాను. కాబట్టి చేస్తున్నది నేను కానప్పుడు ఆపే హక్కు కూడా నాకెక్కడిది. ఉద్యోగం చేసినప్పటి సంగతి వేరు. ఉస్మానియా, నీలోఫర్, గాంధీ ఆసుపత్రులతో పాటు నిజామాబాద్, కర్నూలు, గోదావరి జిల్లాలూ ఇలా చాలా చోట్ల పనిచేశా. దవాఖానాలో కంటిన్యూగా 32 గంటలపాటు డ్యూటీ చేసేదాన్ని. ఇప్పుడు ఇంట్లోనే ఆసుపత్రి కాబట్టి కాసేపు విశ్రాంతి తీసుకునే అవకాశమూ ఉంటుందిగా. మరో విషయం నేను వైద్యవృత్తిలో చేరేటప్పుడు నా దగ్గరికి వైద్యం కోరి వచ్చిన ఏ వ్యక్తికైనా నా శక్తిమేరకు తప్పకుండా చికిత్స చేస్తానని ప్రమాణం చేశాను. అలాంటప్పుడు దాన్ని నేను పాటించాల్సిందేగా!
జనంలో యోగా మీద ధ్యాస మా చిన్నప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా పెరిగింది. ఇది ప్రతి మనిషీ చెయ్యాల్సిన ప్రధానమైన క్రియ అని చెబుతాన్నేను. మా నాన్నగారు సూరి రాఘవ దీక్షితులు హైదరాబాద్‌కి యోగాను పరిచయం చేశారు. ఆయన మన దేశంలోని ప్రముఖ యోగా గురు ధీరేంద్ర బ్రహ్మచారి దగ్గర యోగా నేర్చుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని కోఠిలోని గాంధీ జ్ఞానమందిర్లో ఒక యోగా కేంద్రాన్నీ, సికింద్రాబాద్‌లోని గీతాభవన్‌లో మరో కేంద్రాన్నీ ప్రారంభించారు. నేటికీ అవి కొనసాగుతూనే ఉన్నాయి. అంతేకాదు, రెండు తెలుగు రాష్ర్టాల్లోనూ పలుచోట్ల ఆయన స్థాపించిన వివిధ యోగా సెంటర్లు ఇప్పటికీ జనానికి ఆరోగ్య ప్రసాదాన్ని పంచుతూనే ఉన్నాయి. నాన్న రైల్వేలో పనిచేసేవారు. ఆ ట్రాన్స్ఫర్లు ఆయనకు రకరకాల చోట్ల కేంద్రాలు స్థాపించేందుకు అవకాశాన్నిచ్చాయి. ఉద్యోగం చేసేవారు కూడా సమయం లేదనకుండా చక్కగా యోగా చేసుకోవచ్చు అనడానికి ఆయనే ఉదాహరణ. ఇక, నాన్నకు యోగాతో అంత అనుబంధం ఏర్పడటానికీ, దాన్ని ఇంత మందికీ చేరువ చేయడానికీ వెనుక ఓ ముఖ్యమైన ఘట్టం ఉంది. ఆయన యువకుడిగా ఉన్నప్పుడు ఎగ్జిమా అనే చర్మవ్యాధి బారిన పడ్డారు. దాంతో చర్మం మందంగా మారిపోయి, దురదతో చాలా ఇబ్బంది పడేవారట. యోగా ద్వారా అది మాయం అయింది. అప్పుడు ధీరేంద్ర బ్రహ్మచారిని గురు దక్షిణ ఏమి ఇమ్మంటారని అడిగితే, నీలాగే పదిమందీ దీని ద్వారా లబ్ధి పొందేలా యోగాను వ్యాప్తి చేయమన్నారట. అలా మా కుటుంబం యోగాకు దగ్గరైంది.
మేం ఏడుగురం పిల్లలం. అమ్మ జోతిష్మతి. ఇంట్లో అందరం యోగా చేసేవాళ్లం. ఇందులో ముఖ్యంగా సూర్యనమస్కారాలు ప్రధానమైనవి. ఇవి శరీరంలోని ప్రతి అవయవాన్నీ యాక్టివేట్ చేస్తాయి. ఇవి చేయడం ద్వారా ఎముకలకు, జీవక్రియకు ప్రధానమైన డి- విటమిన్‌ను సంపాదించుకోవచ్చు. నేను కొన్నేండ్ల ముందు దాకా కూడా ఇవి చేసేదాన్ని. అలాగే ప్రాణాయామం కూడా చాలా ప్రధానం. ఇందులో కూడా చాలా రకాలుంటాయి. నేటికీ ఈ శ్వాస సంబంధిత వ్యాయామాలు చేస్తాను. వెన్నునొప్పి, సైనసైటిస్లాంటి రకరకాల జబ్బులు తగ్గించడానికి కూడా యోగా చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నేటి పరిస్థితుల్లో ఆరోగ్యంగా జీవించడానికి ఇది ప్రధానం.
హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో ప్రసూతి వార్డుకు నా పేరు పెట్టారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి జీవిత సాఫల్య పురస్కారం, ఫెడరేషన్ ఆఫ్ అబ్స్టాట్రిక్ అండ్ గైనకలాజిక్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ అవార్డు, యూకే రాయల్ కాలేజీ వారి గౌరవ ఫెలోషిప్ సహా ఎన్నో పేరెన్నికగన్న అవార్డులు ఈ ప్రయాణంలో అందుకున్నా. అవి నాకు సంతోషాన్ని కలిగించేవే అయినా నేను చేసిన పనికి అమిత ఆత్మసంతృప్తి పొందిన సందర్భాలు వేరే ఉన్నాయి. అందులో ఒకటి చెబుతాను. ఓసారి మెడికల్ క్యాంపు నిమిత్తం ఒక ఊరికి వెళ్లాల్సి ఉంది. డాక్టర్లందరం ఫలానా సమయానికి ఫలానా చోట కలుద్దాం అనుకున్నాం. అయితే నేను ఆ సమయానికి వెళ్లలేకపోయాను. క్యాంపు మిస్సయ్యాను. దీంతో చాలా నిరాశగా వెనుదిరిగాను. ఇంటి తలుపు వేస్తున్నానో లేదో, ఓ ఎమర్జెన్సీ కేసు వచ్చింది. నిండు గర్భిణి. గర్భసంచి పగిలిపోయి లోపలే రక్తం కారిపోతున్నది. అప్పటికప్పుడు సర్జరీ చేసి, బిడ్డనూ, తల్లినీ ఇద్దర్నీ రక్షించా. అప్పుడర్థమైంది నా ప్రయాణం ఎందుకు రద్దయిందో. కొందరు నా దగ్గరికి వచ్చి ‘మా అమ్మమ్మకు, అమ్మకు మీరే డెలివరీ చేశారు డాక్టర్… అందుకే కాన్పు కోసం మీ దగ్గరికే వచ్చా’ అని చెబుతుంటారు. మూడు తరాలు నా చేతిలోనే పురుడు పోసుకున్న సందర్భాలు ఒక నిండైన అనుభూతిని కలిగిస్తుంటాయి. అలాగే, పెద్ద సమస్యతో వచ్చి మన ద్వారా బాగైన వాళ్ల కళ్లలో కనిపించే ఆనందం నిజంగా చెప్పలేనంత సంతృప్తిని ఇస్తుంది. అది నేను ఇంకా సంపాదించుకుంటూనే ఉన్నా. అదీ నాకు ఓ బలమేనేమో!

చదువు పూర్తయిన నాటి నుంచి రిటైర్ అయిన దాకా ప్రభుత్వంలో పనిచేశా. మా ఇల్లు సాధారణ జనం ఉండే ప్రాంతంలో ఉంటుంది. వైద్యం కోసం ఇంటిముందుకు వచ్చిన వారిని కాదని అనలేను. వాళ్లందరికీ అందుబాటులో ఉండటమే నాకు కూడా న్యాయమనిపించింది. అందుకే నా దగ్గర ఫీజు తక్కువన్న పేరు వచ్చింది. మా ఇంట్లో కొవిడ్‌కు ముందు వరకూ యోగా కూడా ఉచితంగా నేర్పేవాళ్లం. మెడికల్ కాలేజీలో నా దగ్గర పాఠాలు నేర్చుకున్న వాళ్లలో పేరెన్నికగన్న వైద్యులు ఉన్నారు. వాళ్లకు నేను చదువుతో పాటు విలువల గురించీ చెబుతా. ఎదుటి మనిషి స్తోమతను బట్టి వైద్యం సూచించమంటా. లేదంటే వాళ్లకు అందుబాటులో ఉన్న వైద్యం ఫలానా దగ్గర దొరుకుతుందని అయినా చెప్పమని చెబుతా. రోగులతో మృదువుగా మాట్లాడాలనీ, వారిని చిన్నబుచ్చుకునేలా ఎప్పుడూ చేయొద్దన్న సూచన కూడా నేను పాటిస్తూ వాళ్లకీ చెబుతుంటా.
మా కాలానికీ ఇప్పటికీ వాతావరణం చాలా మారింది. కాబట్టి మంచి ఆరోగ్యం కోసం నేను కొన్ని విషయాలు చెబుతా. మీరు అపార్ట్మెంట్లో ఉన్నా సరే, టెర్రస్ మీదకి వెళ్లి కాసేపు చిన్నపాటి వ్యాయామం చేస్తూ ఎండ తగిలేలా కొంత సమయం గడపండి. శరీరం చురుగ్గా ఉండటానికి ఇది చాలా ప్రధానం. పురుగుమందులు విపరీతంగా వాడుతున్న ఈ తరుణంలో పండ్లు, కూరగాయలు బాగా కడిగి తినాలి. వాయుకాలుష్యం తట్టుకునేందుకు శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయండి. పిల్లల ఎదుగుదల సక్రమంగా ఉండాలంటే బాగా ఆటలు ఆడించాలి. యుక్త వయసు వచ్చిన ఆడపిల్లలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించడం ద్వారా వాళ్లను కొన్ని క్యాన్సర్ల నుంచి కాపాడుకోవచ్చు. ఇక మితాహారం, అందులోనూ సమతులాహారం మనల్ని దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆహారం ఎలా తీసుకోవాలన్న దానికి నాన్న చెప్పే సూత్రం ఒకటి చెబుతా ‘డ్రింక్ సాలిడ్స్ ఈట్ లిక్విడ్స్’. ఘన పదార్థాలను తాగేందుకు అనుకూలం అన్నంత మెత్తగా నమిలి మింగాలి. అప్పుడు లాలాజలంతో ఊరే ఎంజైమ్‌ల ద్వారా అది హాయిగా జీర్ణం అవుతుంది. ద్రవ పదార్థాలను తిన్నట్టుగా… అంటే నెమ్మదిగా కొద్ది కొద్దిగా చప్పరిస్తూ మింగాలి. అప్పుడు జీర్ణవ్యవస్థ అద్భుతంగా ఉంటుంది. అన్నింటినీ మించి మనసును శాంతంగా ఉంచుకోండి. ధర్మంగా బతకండి. బాబా చెప్పినట్టు నేను… సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ అనే నాలుగింటినీ పాటిస్తాను. ఇప్పటికీ వీటన్నిటినీ సాధించడానికే నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాను. ప్రయత్నిస్తే మీరూ వీటిని అందుకుంటారు. ఆల్ ద బెస్ట్!
కొందరు నా దగ్గరికి వచ్చి ‘మా అమ్మమ్మకు, అమ్మకు మీరే డెలివరీ చేశారు.. అందుకే కాన్పు కోసం మీ దగ్గరికే వచ్చా’ అని చెబుతుంటారు. మూడు తరాలు నా చేతిలోనే పురుడు పోసుకున్న సందర్భాలు ఒక నిండైన అనుభూతిని కలిగిస్తుంటాయి.