హైదరాబాద్: కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉన్నది. హిజాబ్ ధరించవద్దంటూ ఒక కాలేజీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే దీనిపై భారత సీనియర్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల స్పందించింది. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. ‘పాఠశాలల్లో గేట్ల వద్ద చిన్నారులను అవమానించడం ఆపేయండి. విద్య ద్వారా వాళ్లు మరింత అభివృద్ది కావాలనుకుంటున్నారు. పాఠశాలను వారు ఒక సురక్షితమైన స్వర్గంగా భావిస్తున్నారు. హిజాబ్ ఉందా లేదా అనేది చూడకండి. మీ చెత్త రాజకీయాలకు వారిని దూరం పెట్టండి. చిన్నారి మనసులను గాయపర్చకండి..ఇక ఇక్కడితో ఆపేయండి’ అని ట్వీట్ చేసింది.