The Walt Disney Co | ప్రముఖ హాలీవుడ్ వినోద సంస్థ ‘ద వాల్ట్ డిస్నీ కంపెనీ’ (The Walt Disney Co.) భారీ స్థాయిలో ఉద్యోగాల కోతను ప్రకటించింది. బాబ్ ఇగర్ వారసుడిగా బాధ్యతలు చేపట్టిన కొత్త సీఈఓ జోష్ డి అమారో, పదవిలోకి వచ్చిన కేవలం నెల రోజుల్లోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగించబోతున్నారు. ఈ మేరకు జోష్ డి అమారో ఉద్యోగులకు ఒక మెమో పంపారు. మార్కెటింగ్ విభాగం, స్టూడియోలు, టీవీ వ్యాపారాలు, ఈఎస్పీఎన్ (ESPN), ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీతో పాటు కొన్ని కార్పొరేట్ విభాగాల్లో ఈ కోతలు ఉండబోతున్నాయి. మార్కెటింగ్ విభాగాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అసద్ అయ్యాజ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ‘యూనిఫైడ్ మార్కెటింగ్ స్ట్రక్చర్’లో భాగంగా ఈ మార్పులు చేస్తున్నారు.
వినోద రంగంలో వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా, సాంకేతికతతో కూడిన శ్రామిక శక్తిని నిర్మించేందుకు మరియు కార్యకలాపాలను క్రమబద్ధీకరించేందుకు ఈ నిర్ణయం అవసరమైందని డి అమారో తన మెమోలో పేర్కొన్నాడు. గత కొద్ది నెలలుగా కంపెనీలోని వివిధ విభాగాలను పరిశీలించిన తర్వాత, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మరింత చురుకైన వ్యవస్థను రూపొందించాలని నిర్ణయించాం. ఇందులో భాగంగానే కొన్ని పాత్రలను తొలగిస్తున్నాం అని చెప్పుకోచ్చాడు.