Imax Screen | ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్స్‌లో ఒకటిగా నిలుస్తోంది రామాయణ. దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ మహాకావ్య చిత్రం, గ్లోబల్ స్టాండర్డ్స్‌తో రూపొందుతూ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుతోంది. హీరోగా రణబీర్ కపూర్, హీరోయిన్గా సాయి పల్లవి నటిస్తుండటం ఈ సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది. ఈ చిత్రం ప్రత్యేకతల్లో ముఖ్యమైనది ఏమిటంటే ఇండియన్ సినిమా నుంచి మొట్టమొదటి సారి భారీ స్థాయిలో ఐమ్యాక్స్ వెర్షన్లో రూపొందించడం. ఈ విషయాన్ని మేకర్స్ కూడా గట్టిగా ప్రమోట్ చేస్తూ, దీపావళి కానుకగా అంతర్జాతీయ స్థాయిలో గ్రాండ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐమ్యాక్స్ స్క్రీన్స్‌ను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను విడుదల చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
అయితే, ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్‌కు అడ్డంకి ఎదురైంది. జపాన్ నుంచి వస్తున్న మరో విజువల్ స్పెక్టకల్ సినిమా గాడ్జిల్లా మైనస్ జీరో ‘రామాయణ’కు పోటీగా నిలవబోతోంది. ఇప్పటికే 2023లో విడుదలైన గాడ్జిల్లా ఐనస్ వన్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో అకాడమీ అవార్డ్స్ గెలుచుకోవడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న ‘గాడ్జిల్లా మైనస్ జీరో’పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రం జపాన్ నుంచి వస్తున్న తొలి ఐమ్యాక్స్ వెర్షన్ సినిమాగా కన్ఫర్మ్ కావడం ఆసక్తికరంగా మారింది. ఇదే ఇప్పుడు ‘రామాయణ’ మేకర్స్‌కు పెద్ద సవాలుగా మారింది.
ప్రత్యేకంగా నవంబర్ 6న ‘గాడ్జిల్లా మైనస్ జీరో’ విడుదల తేదీ ఖరారు కావడంతో, ఐమ్యాక్స్ స్క్రీన్స్ కోసం పోటీ మరింత తీవ్రమవుతోంది. గాడ్జిల్లా ఫ్రాంచైజ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ దృష్ట్యా, అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కువ స్క్రీన్స్ ఈ సినిమాకే దక్కే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.దీంతో ‘రామాయణ’కు ఐమ్యాక్స్ స్క్రీన్స్ విషయంలో కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్లోబల్ ఆడియెన్స్‌ను ఆకర్షించే విషయంలో ఈ క్లాష్ ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ క్లాష్‌ను ఎలా హ్యాండిల్ చేస్తారు? రిలీజ్ స్ట్రాటజీలో మార్పులు చేస్తారా? లేక పోటీని ఎదుర్కొంటారా? అనే అంశాలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి. ఏదేమైనా, ఒకవైపు భారతీయ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’, మరోవైపు విజువల్ ఎఫెక్ట్స్‌కు కొత్త ప్రమాణాలు సెట్ చేసిన గాడ్జిల్లా సిరీస్ ఈ రెండు భారీ చిత్రాల మధ్య పోటీ సినీ అభిమానులకు మాత్రం ఆసక్తికరమైన అనుభవాన్ని ఇవ్వనుంది.