న్యూయార్క్, డిసెంబర్ 19: ఒకవైపు నదీజలాలు అడుగంటిపోతున్నాయి. మరోవైపు సముద్ర జలాలు తాగటానికి పనికిరావు. ఇంకోవైపేమో ఏటికేడు జనాభా పెరిగి నీటి వినియోగం పెరుగుతున్నది. ఈ పరిస్థితుల్లో జనాభాకు తగ్గట్టు తాగునీటిని సరఫరా చేయటం చాలా కష్టం. మురుగునీటి శుద్ధి, క్లౌడ్ సీడింగ్, డీసాలినేషన్ పద్ధతులు కొంత వరకే పనిచేస్తాయి. అయితే, ఈ సమస్యలకు పరిష్కార మార్గం చూపారు శాస్త్రవేత్తలు. అమెరికాలోని ప్రెయిరీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు సముద్ర జలాలపై ఉండే నీటి ఆవిరిని ఒడిసిపట్టే కొత్త విధానాన్ని కనుగొన్నారు. ఆ నీటి ఆవిరి స్వచ్ఛమైన నీరు. దాన్ని వినియోగించుకోగలిగితే కరువు ప్రాంతాల్లో చాలా వరకు తాగునీటి సమస్యకు చెక్ పెట్టవచ్చని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలు నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి.