హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర బదిలీల కోసం జారీచేసిన జీవో 402 అమలును నిలిపివేస్తూ హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా జీవో 402 ఉన్నదంటూ పలువురు ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. జీవో ప్రకారం పరస్పర బదిలీలకు అనుమతిస్తే సీనియారిటీ నష్టపోతామని, రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్న జీవోను రద్దు చేయాలని పిటిషన్ల తరఫు న్యాయవాదులు వాదించారు. జీవో అమలును తాతాలికంగా సస్పెండ్ చేసిన న్యాయమూర్తి జస్టిస్ బీ విజయసేన్‌రెడ్డి.. తదుపరి విచారణను జూన్ 20కి వాయిదా వేశారు.