పాత్రికేయుడిగా కెరీర్ ప్రారంభించి నిర్మాతగా ఎదిగారు ఎస్కేఎన్. టాక్సీవాలా, బేబీ చిత్రాలు ఆయన అభిరుచికి తార్కాణాలు. దర్శకుడు సాయిరాజేష్‌తో కలిసి రవి నంబూరి దర్శకత్వంలో ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ సందర్భంగా సోమవారం ఆయన విలేకరులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలివి..
చెన్నైలో నివసిస్తున్న తెలుగుజంట ప్రేమకథ ఇది. అందుకే ఈ సినిమాకు ‘చెన్నై లవ్‌స్టోరీ’ అని పేరు పెట్టాం. ‘బేబీ’ తర్వాత మేం చేస్తున్న ప్రేమకథ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే ఒక మంచి సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రావాలనే ఉద్దేశంతో ఏడాది సమయం తీసుకున్నాం. సాయిరాజేష్ కథ, కథనం ఈ సినిమాకు ప్రధాన బలం. ఇందులోని కథానాయకుడి పాత్రకు కిరణ్ అబ్బవరం వందశాతం న్యాయం చేశాడు. కిరణ్ అబ్బవరంలోని పరిణతి చెందిన నటుడ్ని ఈ సినిమాలో చూస్తారు. ఈ ఏడాది అన్ని అవార్డుల నామినేషన్స్‌లో కిరణ్ పేరుంటుంది. సినిమాపై అతనికున్న ప్యాషన్‌ను ఈ సినిమా టైమ్‌లో చూశాను. ఇందులో హీరోయిన్ పాత్ర చాలా కీలకం. కథ మొదలవ్వడమే కథానాయిక దృక్కోణంలో మొదలవుతుంది. ప్రతిభ గల నటి మాత్రమే పోషించగలిగే పాత్ర ఇది. అందుకే శ్రీగౌరిప్రియను ఎంపిక చేశాం. అనుకున్నట్టే అద్భుతంగా నటించింది.
ఇది భావోద్వేగాలతో ఆకట్టుకునే కథ. అందుకే విజువల్ బ్యూటీ కోసం ఎక్కువ సమయం తీసుకున్నాం. చెన్నై, పాండిచ్చేరి, వైజాగ్, చీరాల ఇలా పలు లొకేషన్స్‌లో షూట్ చేశాం. సూర్యోదయం, సూర్యాస్తమయం.. ఇలా ప్రతి షాట్ సహజంగా ఉండేలా ప్లాన్ చేశాం. సినిమాకు కావాల్సినంత రైట్ ఎమోషన్స్ వచ్చేలా ఔట్ పుట్ తీసుకున్నాం. ‘బేబీ’ కల్ట్ లవ్‌స్టోరీ, ఇది క్లాసిక్ లవ్‌స్టోరీ. కథ విన్నవెంటనే మ్యూజిక్ ఇచ్చేందుకు మణిశర్మ ఓకే చెప్పారు. దర్శకుడు రవి నంబూరి దీన్నొక హృద్యమైన ప్రేమకావ్యంగా మలిచాడు. తను రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. ప్రచార చిత్రాల కారణంగా సినిమాపై మంచి హైప్ వచ్చింది. ఆడియన్స్ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.