అగ్ర కథానాయకుడు నాని ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ షూట్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో నానితో సినిమా చేయాలనుకున్న దర్శకులంతా వేరే హీరోల బాట పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ‘బ్లడీ రోమియో’ కథను నానితో తీసేందుకు సిద్ధంగా ఉన్న సుజీత్ సైతం ‘ది ప్యారడైజ్’ లేట్ కారణంగానే ‘ఓజీ 2’ను లైన్లో పెట్టే పనిలో పడ్డారని ఇన్సైడ్ టాక్. ఇదిలావుంటే.. నాని తాజాగా దర్శకుడు వెంకీ అట్లూరి కథకు ఓకే చెప్పారు. వీరిద్దరి మధ్య చాలాకాలంగా కథా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు వెంకీ రీసెంట్గా చెప్పిన కథ నానిని బాగా ఆకట్టుకున్నదట.
దాంతో ఆయన పచ్చజెండా ఊపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా నిర్మిస్తారట. అందరూ అనుకుంటున్నట్టు దర్శకుడు సుజీత్ ‘బ్లడీ రోమియో’ కథను పక్కన పెట్టి ‘ఓజీ 2’ను లైన్లోకి తెస్తే, ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని చేసే సినిమా వెంకీ అట్లూరిదే అవుతుంది. ఒకవేళ సుజీత్ ‘బ్లడీ రోమియో’ సినిమానే ముందుకు తెస్తే, ఆ సినిమా పూర్తయ్యాక వెంకీ అట్లూరి సినిమా ఉంటుంది. ఏదేమైనా నాని లైనప్లో సరైన సినిమా వచ్చి చేరింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.