గువాహటి: దేశానికి ఐదోసారి అండర్-19 ప్రపంచకప్ అందించిన యంగ్ కెప్టెన్ యష్ ధుల్ (261 బంతుల్లో 200 నాటౌట్; 26 ఫోర్లు) రంజీ ట్రోఫీలో డబుల్ సెంచరీతో సత్తాచాటాడు. గ్రూప్-‘హెచ్’లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన పోరులో ధుల్ దంచి కొట్టాడు. దేశవాళీల్లో తొలిసారి ఆడుతున్న ధుల్ కెరీర్లో ఇదే మొదటి ద్విశతకం కావడం విశేషం. ఛత్తీస్‌గఢ్ 482/9 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఫాలోఆన్‌లో భాగంగా రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఢిల్లీ.. ఆదివారం ఆట ముగిసే సమయానికి 396/2తో నిలిచింది. యష్ ధుల్ తో పాటు ధ్రువ్ షోరే (100), నితీశ్ రాణా (36 బంతుల్లో 57 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) రాణించారు. కాగా.. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా సాధించలేకపోయిన ఢిల్లీ నాకౌట్ రేసు నుంచి తప్పుకుంది.