Lagacharla | కొడంగల్, డిసెంబరు 13 : నెలరోజులుగా కడుపుకు అన్నం లేదు.. కంటికి నిద్ర లేదు.. ఊళ్లె మగపురుగు అనేదే లేకుండపోయింది.. చిన్నపిల్లలతోనే కాలం గడుపుతున్నం.. మా వాళ్లు జైళ్ల ఏమి తిన్నరో, ఎలా ఉన్నారో? ఒంట్ల బాగలేకుంటే ఎవలు జూస్తురు? ఇంటికాడుంటే మేము జూసుకునేటోళ్లం. ఎంతకైనా సీఎం రేవంత్‌రెడ్డి మనసు ఎందుకు కరుగుతలేదు. ఇప్పటికైనా మా బతుకులతో ఆడుకోవద్దు.. మా మానాన మమ్మల్ని ఇడిసి పెటుర్రి.. ఇవీ లగచర్ల పరిసర బాధిత గ్రామాల రైతు కుటుంబాల గోస. కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం కోస్గి-తుంకిమెట్ల రోడ్డులోని లగచర్ల గేటు వద్ద రోడ్డుపై బాధిత రైతు కుటుంబాలు శుక్రవారం ధర్నా చేపట్టాయి. ఈ ధర్నా సందర్భంగా పలువురు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మా వాళ్లకు ఏమైనా అయితే ఎవరు బాధ్యులని, మా బతుకులు ఏం కావాలని గిరిజన రైతులు కన్నీరు పెట్టుకున్నారు. అరెస్టు అయిన వారిలో చాలా మంది అనారోగ్యాలతో బాధపడుతున్న వారే ఉన్నారని, ఏ విధంగా ఉన్నారో, ఏం మందులు వేసుకుంటున్నారో అర్థం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం సొంత నియోకవర్గంలో ఇంత జరుగుతున్నా, ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నా.. సీఎం రేవంత్‌రెడ్డి మనస్సు కరగడం లేదని, సీఎంకు మాపై ఇంత ద్వేషం ఎందుకో? తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
పులిచెర్లకుంట తండాకు చెందిన హీర్యానాయక్ అరెస్టుకు ముందు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని, జైలుకు వెళ్లిన బాధతో గుండెజబ్బు వచ్చిందని గ్రామస్థులు తెలిపారు. చేతికి బేడీలు వేసి రోడ్డుపై నడిపించుకొని వెళ్లడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. గుండెజబ్బు వచ్చిన వ్యక్తిని చూసుకుందామని కుటుంబసభ్యులు వెళ్లినా కలవనివ్వకుండా ఆంక్షలు విధించడం బాధకరమని పేర్కొన్నారు. కన్నతల్లి తల్లడిల్లుతున్నా సాయంత్రం వరకు కూడా కొడుకును చూడనివ్వకపోవడం దుర్మార్గమని చెప్పారు. ఎక్కడ ఏ ఆసుపత్రికి తీసుకెళ్తున్నారో కూడా సమాచారం ఇవ్వక పోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఆయనతోపాటు ఇతరులకు ఏమైనా అయితే సీఎం రేవంత్‌రెడ్డిదే బాధ్యతగా పేర్కొన్నారు. ఇప్పటికైనా సీఎం మనస్సు మార్చుకొని మా వాళ్లను వదిలిపెట్టాలని కోరారు. అప్పుడు, ఇప్పుడు అంటూ కాలయాపన చేస్తూ, మా బతుకులతో ఆడుకోవద్దని హితవు పలికారు.
మరో మూడు రోజులు గడిస్తే.. తొమ్మిది నెలలు నిండుతయి. లగచర్ల ఘటనలో మా ఆయనను పోలీసులు జైల్లో పెట్టారు. నన్ను చూసుకోవడానికి ఇంట్లో ముసలివాళ్లు తప్ప ఎవరూ లేరు. అకస్మాత్తుగా నొప్పులొస్తే.. ఏం చేయాలో ఆందోళనగా ఉన్నది. ఎక్కువగా ఆలోచిస్తే పుట్టే బిడ్డకు ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనని భయం పట్టుకున్నది. ఈ పరిస్థితులో భర్త తోడుగా ఉంటే ఎంతో అండగా ఉంటుంది. నాకు ఆ అదృష్టం లేనట్టుగా ఉన్నది. రేవంత్‌రెడ్డి వస్తే బాగుపడతామనుకున్నాం. కానీ ఈ విధంగా బాధలు పడతామని కలలో కూడా అనుకోలేదు.
మా మామ హీర్యానాయక్‌కు జైల్లో ఉన్న భయంతోనే గుండెపోటు వచ్చింది. మాకు 6 ఎకరాలు స్వతహాగా కొన్న భూమి రోడ్డుకు అనుకొని ఉన్నది. ఎకరాకు దాదాపుగా రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ధర పలుకుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటు చేస్తే మొత్తం భూమిని కోల్పోతం. కోట్ల ధర పలికే భూములు పోతుంటే బాధ ఉంటుంది కదా. ప్రభుత్వం ఇచ్చిన భూమి కాదు. కష్టపడి కొనుక్కొన్నది. గుండెపోటు వస్తే బేడీలు వేసి మరీ ఆసుపత్రికి ఎలా తీసుకెళ్తారు. కనీసం కలిసే పరిస్థితి లేకుండా పోయింది. ఏమైనా అయితే మాకు దిక్కెవరు.