హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): నేరాల స్వరూపం వేగంగా మారుతున్న నేపథ్యంలో కృత్రిమ మేధ(ఏఐ), ఆధునిక సాంకేతికతను పోలీసింగ్‌లో విసృ్తతంగా వినియోగించాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. తెలంగాణ పోలీసింగ్ దేశంలోనే ముందంజలో ఉండాలంటే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్ అండ్ సిస్టమ్స్(సీసీటీఎన్ఎస్), ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్)లను నిరంతరం అప్డేట్ చేస్తూ సమర్థంగా అమలు చేయాలని తెలిపారు. శనివారం బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)లో అన్ని విభాగాల పోలీసు అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కొత్త నేరచట్టాల (ఎన్సీఎల్) అమలు, ఈ-సాక్ష్య, ఈ-ఫోరెన్సిక్, ఐసీజేఎస్ అనుసంధానం, జాతీయస్థాయి పోర్టళ్లలో తెలంగాణ పనితీరుపై సమీక్షించారు. మెరుగుపర్చాల్సిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. కోర్టు కేసుల నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, న్యా య ప్రక్రియలను కచ్చితంగా పాటిస్తూ కేసుల పురోగతిని సమర్థంగా పర్యవేక్షించాలని చెప్పారు. రాష్ట్రస్థాయిలో నేర నియంత్రణకు సంబంధించిన వివిధ ప్రమాణాల అమలులో అత్యుత్తమ ప్రతి భ కనబరిచిన పోలీసు విభాగాలను డీజీ పీ అభినందించారు.
క్లస్టర్-1లో హైదరాబాద్, క్లస్టర్-2లో రామగుండం, క్లస్టర్-3లో నల్లగొండ, క్లస్టర్-4లో సూర్యాపేట ప్రథమ స్థానాల్లో నిలువడంతో ఆయా విభాగాల అధికారులను డీజీపీ సర్టిఫికెట్లతో సతరించారు. ఏఐ ఆధారిత అప్లికేషన్లు రూపొందించి పోలీసుశాఖలో అంతర్గత సామర్థ్యం, పర్యవేక్షణను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్న యువ ఐపీఎస్ అధికారులను అభినందించారు.