(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : అధికారమే పరమావధిగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనాలోచితంగా ఇచ్చిన గ్యారెంటీలతో రాష్ర్టాలు దివాలా తీసే దుస్థితి వాటిల్లుతున్నది. హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో దాదాపుగా ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలపై సొంతపార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్ప తాజాగా ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు. సొంత నియోజకవర్గం విజయనగరలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న గవియప్ప మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఐదు గ్యారెంటీలపై అసహనం వ్యక్తం చేశారు. గ్యారెంటీల కారణంగా ఖజానాలో నిధులకు కటకట మొదలైనట్టు వాపోయారు. నిధుల లేమితో పేదలకు ఇండ్లను కూడా ఇవ్వలేని దుస్థితి వాటిల్లినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం సిద్ధరామయ్య వెంటనే ఐదు గ్యారెంటీల్లో అనవసరమైనటువంటి 2-3 హామీలనైనా రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఎమ్మెల్యే వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మండిపడ్డారు. షోకాజ్ నోటీసులు జారీ చేస్తానని హెచ్చరించారు.
‘కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఐదు గ్యారెంటీల అమలుకే ఏటా ఖజానా నుంచి రూ. 40 వేల కోట్ల మేర ఖర్చు చేయాల్సి వస్తున్నది. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఇండ్లను కూడా ఇవ్వలేని దుస్థితి దాపురించింది. గ్యారెంటీలను రద్దు చేయడం మంచిది. అవసరంలేని 2-3 గ్యారెంటీలనైనా నిలిపేయాలి. అప్పుడే పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేయగలం. ఏదేమైనా దీనిపై సీఎం సిద్ధరామయ్యనే నిర్ణయం తీసుకోవాలి. ఆయన ఏ నిర్ణయం తీసుకొన్నా అందరం దానికి కట్టుబడి ఉంటాం’ అని గవియప్ప అన్నారు.
బహిరంగ కార్యక్రమంలో గ్యారెంటీలపై గవియప్ప తన అభిప్రాయాన్ని వెల్లడించడంపై డిప్యూటీ సీఎం శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్టు ప్రకటించారు. ‘ఇది కాంగ్రెస్ పార్టీ. గ్యారెంటీలపై గవియప్ప అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. గ్యారెంటీలను ఎట్టిపరిస్థితుల్లో నిలిపేయబోము. గ్యారెంటీలకు వ్యతిరేకంగా ఎవ్వరూ ఇకపై మాట్లాడొద్దు. గ్యారెంటీలు రద్దు చేయాలన్న గవియప్పకు షోకాజ్ నోటీసులు జారీ చేయబోతున్నా’ అంటూ డీకే ఆగ్రహం వ్యక్తం చేశారు.