బుల్డోజర్ పాలనకు అన్నివైపుల నుంచీ నిరసన వ్యక్తమవుతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గేలా కనిపించడంలేదు. పేదలపై విరుచుకుపడటంలో తాము హైడ్రాకేమీ తీసిపోలేదని రెవెన్యూ అధికారులు నిరూపిస్తున్నారు. తాజాగా సోమవారం ఉదయం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గాజులరామారం సాయిబాబానగర్లో పేదల నివాసాలపై అధికారులు విరుచుకుపడ్డారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ 40కి పైగా రేకుల షెడ్లను నేలమట్టం చేశారు. 50 ఏండ్ల నుంచీ నివాసం ఉంటున్నామని.. గూడు కూల్చితే ఎక్కడికి పోవాలని నిర్వాసితులు కన్నీరుమున్నీరయ్యారు.
కుత్బుల్లాపూర్, ఆగస్టు 3 : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం సాయిబాబానగర్ పరిధిలో అత్యంత విలువైన దిల్(డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాండ్ హోల్డింగ్ లిమిటెడ్) సంస్థ భూముల్లో వెలిసిన నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఎలాంటి నోటీసుల్లేకుండా రెవెన్యూ యంత్రాంగం సోమవారం ఉదయం మెరుపుదాడులకు దిగింది. భారీ పోలీస్ బందోబస్తు నడుమ జేసీబీలతో తొలగింపు ఆపరేషన్ చేపట్టింది. సుమారు ఐదెకరాల విస్తీర్ణంలో ఉన్న పారిశ్రామిక షెడ్లు, వ్యాపార సముదాయాలతో పాటు 40కి పైగా చిన్న చిన్న రేకుల షెడ్లను నేలమట్టం చేసింది. సుమారు 50 ఏండ్ల నుంచి ఇక్కడ నివాసముంటున్నామని.. ముందస్తు సమాచారం లేకుండా తమను రోడ్డున పడేశారంటూ బాధితులు కన్నీంటి పర్యంతమవుతున్నారు.
అధికారులు కూల్చివేతలు ప్రారంభించగానే స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. పనులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో సూరారం సాయిబాబానగర్ పరిసరాల్లో కొంతసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. సూరా రం సీఐ బాలరాజు, ఎస్సైలు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో లాఠీలకు పనిచెప్పడంతో పలువురికి గాయాలయ్యాయి. నిరుపేదలు నివాసముంటున్న ఇండ్ల్లకు ఎలాం టి హాని తలపెట్టలేదని, కేవలం వాణిజ్య అవసరాలు, అక్రమ సంపాదన కోసం నిర్మించిన పారిశ్రామిక షెడ్లు, సూరారం ప్రధాన రహదారికి ఇరువైపులా వెలిసిన అక్రమ వాణిజ్య దు కాణాలు, చిన్నచిన్న తాత్కాలిక రూములను నేలమట్టం చేశామని అధికారులు తెలిపారు.
మేం గరీబోళ్లం. 50 ఏండ్ల నుంచి ఇక్కడ్నే ఉంటున్నం. కాయకష్టం చేసుకొని బతుకుతున్నం. మా ఇండ్లు కూలగొట్టిన్రు. అడిగితే పోలీసోళ్లు ఇష్టమున్నట్టు కొట్టిన్రు. కొట్టకుండ్రి సార్ అన్నంక కూడా కొడుతున్నరు. తినే అన్నంల మన్ను పోశిన్రు.
– నిర్వాసితురాలు, గాజులరామారం
ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఉన్నపళంగా కూల్చివేయడం ఏందని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నో ఏండ్ల నుంచి ఇదే భూముల్లో ఉంటున్నామని, పన్నులు చెల్లిస్తున్నామని వారు చెబుతున్నారు. కానీ తమకు సమాచారం, సమయం ఇవ్వకుండా బుల్డోజర్లతో వచ్చి కూల్చివేతలు చేపట్టారని ఆందోళన చెందుతున్నారు. షెడ్లలో ఉన్న యంత్రాలు, విలువైన సామగ్రిని కూడా బయటకు తీసుకెళ్లేందుకు సమయం ఇవ్వకపోవడంతో చాలా నష్టం వాటిల్లిందని చెప్పారు.

సర్వే నంబర్ 49/6 నుంచి 49/9 పరిధిలోని ఉన్న 16.20 ఎకరాల స్థలాన్ని ఐటీ, పా రిశ్రామిక అభివృద్ధి కోసం 2007లో అప్పటి ప్రభుత్వం ఎకరం రూ.6 కోట్ల చొప్పున దిల్ సంస్థకు కేటాయించింది. కాలక్రమేణా అక్కడ ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు కాకపోవడం తో భూమి ఖాళీగా ఉన్నది. దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు ఆక్రమణదారులు, రియ ల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ స్థలాన్ని 60 చదరపు గజాల చొప్పున ప్లాట్లు విభజించి అక్రమంగా విక్రయించుకున్నారు. కాగా మరికొంతమంది అదే స్థలాల్లో యథేచ్ఛగా పారిశ్రామిక షెడ్లు, గోడౌన్లు, కమర్షియల్ షాపులు నిర్మించి అద్దెలకు తిప్పుకోవడం ప్రారంభించారు.