తిమ్మాపూర్ జూన్7: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమో ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశానికి ‘డీఈఈ సెట్-2024’ నోటిఫికేషన్ విడుదలైందని డైట్ ప్రిన్సిపాల్ శ్రీరాం మొండయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎల్ఎండీ కాలనీలోని డైట్ కళాశాలతోపాటు పలు ప్రైవేట్ కళాశాల్లో రెండు సంవత్సరాల కోర్సులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అభ్యర్థులకు ఇంటర్లో 50 శాతం మార్కులు ఉండాలని, షెడ్యూల్డ్ కులాలు, దివ్యాంగ అభ్యర్థులకు 45శాతం మార్కులు ఉండాలన్నారు. సెప్టెంబర్ ఒకటో తేది నాటికి విద్యార్థి వయసు కనీసం 17 సంవత్సరాలు ఉండాలన్నారు. ప్రవేశ పరీక్ష వచ్చే నెల 10న ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈనెల 30లోగా ఆన్లైన్లో http://deecet.cdsc.Telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.