దుబాయ్: తీవ్ర ఒత్తిడిలోనూ క్రీడా స్ఫూర్తి చాటిన న్యూజిలాండ్ క్రికెటర్ డారిల్ మిచెల్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ‘స్పిరిట్ ఆఫ్ క్రికెట్’అవార్డు ప్రకటించింది. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో డారిల్ ప్రవర్తనకు గాను ఈ పురస్కారాన్ని ఇచ్చినట్లు పేర్కొంది. 2021 నవంబర్ 10న అబుదాబి వేదికగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్ జరుగగా.. ఆ మ్యాచ్ 18వ ఓవర్లో నాన్స్ట్రయికింగ్లో ఉన్న మిచెల్ సింగిల్ తీసే క్రమంలో అనుకోకుండా బౌలర్ ఆదిల్ రషీద్‌కు అడ్డువచ్చాడు. ఆ సమయంలో సింగిల్ తీసే అవకాశం ఉన్నా.. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని భావించిన మిచెల్.. సహచరుడు నీషమ్‌ను పరుగు వద్దని వారించాడు. దీంతో అభిమానులతో పాటు విశ్లేషకులు మిచెల్ చర్యను అభినందించారు. తాజాగా 2021కి గానూ ఐసీసీ ఈ చర్యకు ‘స్పిరిట్ ఆఫ్ క్రికెట్’అవార్డు ప్రకటించింది.
ఆ ఒక్క పరుగు..!
క్రీడాస్ఫూర్తికి మారుపేరైన న్యూజిలాండ్ ఆటగాళ్లకు ఈ అవార్డు లభించడం ఇది నాలుగోసారి. గతంలో డానియల్ వెటోరీ, బ్రెండన్ మెక్కల్లమ్, కేన్ విలియమ్సన్ ఈ పురస్కారం పొందారు. 2021 సంవత్సరానికి గాను ఐసీసీ బుధవారం ఈ పురస్కారాన్ని ప్రకటించడంపై మిచెల్ ఆనందం వ్యక్తం చేశాడు. ‘ఈ అవార్డు దక్కడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఎన్నో మధురానుభూతులు మిగిల్చింది. ఇప్పుడీ అవార్డు దాన్ని రెట్టింపు చేసింది. న్యూజిలాండ్ క్రికెటర్‌గా క్రీడాస్ఫూర్తిని చాటడంలో ఎప్పుడూ ముందుంటా. ఆ రోజు జట్టు విజయానికి ప్రతి పరుగు అత్యవసరమైన ఒత్తిడిలోనూ తప్పటడుగు వేయలేదు. పెద్ద మ్యాచ్‌ల్లో ఎలాంటి వివాదాలు లేకుండా సాగాలనుకుంటాం. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే.. అంతా క్షణాల్లో జరిగిపోయినట్లు కనిపిస్తున్నది’అని మిచెల్ ఆనాటి విషయాలను గుర్తు చేసుకున్నాడు.