స్టావెంజర్: నార్వే చెస్ స్టార్ మాగ్నస్ కార్ల్‌సన్‌కు భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. నార్వే చెస్ టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన రౌండ్-6 పోరులో గుకేశ్..కార్ల్‌సన్‌ను మట్టికరిపించాడు. ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన పోరులో కార్ల్సన్ చేసిన తప్పిదాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్న ప్రపంచ చాంపియన్ గుకేశ్ చిరస్మరణీయ విజయం సాధించాడు. గుకేశ్‌కు గేమ్ చేజార్చుకున్న ఒత్తిడిలో బల్లపై బలంగా గుద్ది కార్ల్సన్ తన కోపాన్ని ప్రదర్శించగా, గుకేశ్ విజయాన్ని ఆస్వాదిస్తూ కనిపించాడు. మరోవైపు అర్జున్..వీ యి(చైనా)పై, వైశాలి..హంపిపై గెలిచి ముందంజ వేశారు.