బంజారాహిల్స్, డిసెంబర్ 17: ఆన్లైన్ లావాదేవీలు ఎక్కువగా చేస్తున్నందున ఆర్బీఐ ద్వారా రూ.5 లక్షల లిమిట్‌ను అందిస్తున్నామంటూ నమ్మించి.. బురిడీ కొట్టించిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హకీంపేటలో నివాసముంటున్న మహ్మద్ నసీరుద్దీన్ టైలర్‌గా పనిచేస్తుంటాడు. ఈ నెల 6న కోల్‌కతాకు చెందిన డిజిటల్ సీఎస్పీ పాయింట్ అనే సంస్థ నుంచి మాట్లాడుతున్నామంటూ ఓ వ్యక్తి నసీరుద్దీన్‌కు కాల్ చేశాడు.
ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ పాయింట్ పేరుతో రూ.5 లక్షల ఆన్లైన్ లిమిట్‌ను ఆర్బీఐ మంజూరు చేసిందని చెప్పాడు. కొంత డబ్బును అకౌంట్లో డిపాజిట్ చేయాలంటూ.. అరగంట తర్వాత డ్రా చేసుకోవచ్చని నమ్మబలికాడు. ఇది నిజమని నమ్మిన నసీరుద్దీన్ సుమారు రూ.80వేల దాకా అకౌంట్లో వేశాడు. డబ్బులు వేసినా.. క్రెడిట్ లిమిట్ పెరుగకపోవడంతో అనుమానం వచ్చి ఫోన్ చేస్తే..స్విచ్చాఫ్ వచ్చింది. బాధితుడు శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఓ వైద్యుడికి టోకరా వేశారు సైబర్‌నేరగాళ్లు..బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. ఆనంద్ బంజారా కాలనీలో నివాముంటున్న సంతోష్‌రెడ్డి అనే వైద్యుడికి ఇటీవల గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు.క్విక్ సపోర్ట్ యాప్ ద్వారా ఫోన్ యాక్సెస్ తీసుకొని.. పేటీఎం కేవైసీ వివరాలు అప్డేట్ చేస్తామని నమ్మించి రూ.53,795 కాజేశాడు. బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కుత్బుల్లాపూర్, డిసెంబర్17: తక్కువ ధరకు ఫ్యాన్సీ నంబర్ వస్తుందని ఆశపడిన ఓ వ్యక్తి తన ఖాతా వివరాలను ఇతరులతో పంచుకొని.. నగదును పోగొట్టుకున్నాడు. పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కొంపల్లికి చెందిన ఓ వ్యక్తికి ఆగంతకుడు ఎయిర్టెల్ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నామని..కొరియర్లో ఫ్యాన్సీ నంబర్ పంపిస్తామంటూ చెప్పి.. వివరాలు తీసుకొని..సుమారు రూ.58,000 కాజేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాచిగూడ,డిసెంబర్ 17: గోల్నాక ప్రాంతానికి చెందిన శ్రీనివాస్‌కు ఆగంతకుడు ఫోన్ చేసి..క్రెడిట్ కార్డు నంబర్ సవరించాలంటూ..వివరాలు తీసుకొని రూ.50,290 తస్కరించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్సై రాజేంద్రన్ తెలిపారు.