Sanjay Malhotra : దేశంలో పెట్రో ధరల పెంపుపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. మిడిల్ ఈస్ట్ వార్, క్రూడాయిల్ ధరల పెరుగుదల కారణంగా దేశంలో పెట్రో ధరలు క్రమంగా పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ సంక్షోభం దీర్ఘకాలం కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని, ద్రవ్యోల్బణం, చమురు దిగుమతులపై ప్రభావం తప్పదని అభిప్రాయపడ్డారు.
స్విట్జర్లాండ్లో జరిగిన స్విస్ నేషనల్ బ్యాంక్ అండ్ ద ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ సదస్సులో సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదల ప్రభావం నుంచి ప్రభుత్వం ప్రజల్ని నిరంతరం రక్షించలేదన్నారు. నిరంతరం ధరల పెరుగుదల కొనసాగితే, ప్రభుత్వం దేశంలో పెట్రో ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకునేందుకు ఎంతో సమయం పట్టదన్నారు. ఇప్పటికే చమురు ధరల్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాల్ని తగ్గించిందని గుర్తు చేశారు. ఆయిల్ కంపెనీల నష్టాలను ప్రభుత్వం భరిస్తూ వస్తోందని, ధరల్ని అదుపులో ఉంచుతోందని వెల్లడించారు.
అయితే, ప్రభుత్వం ఎంతకాలం ఈ పని చేయగలదనేది సందేహమన్నారు. దేశానికి చమురు అందించే హార్ముజ్ జలసంధిని ఇరాన్, అమెరికా మూసేసిన నేపథ్యంలో చమురు రవాణా జరగకుండా, సంక్షోభం తలెత్తింది. మరోవైపు దేశంలో చమురును పొదుపుగా వాడాలని ప్రధాని మోదీ ఇటీవల ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.