హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితర బీజేపీ నేతలంతా కలిసి దేశాన్ని దోచుకొంటున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు అతుల్‌కుమార్ అంజాన్ నిప్పులు చెరిగారు. మతాల మధ్య చిచ్చుపెట్టి, దేశాన్ని అమ్మేసేందుకు బీజేపీ కుయుక్తులు పన్నుతున్నదని, హైదరాబాద్ పేరును సైతం మార్చేందుకు ప్రయత్నిస్తున్నదని ధ్వజమెత్తారు. సీపీఐ 97వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదివారం మగ్దుంభవన్‌లో జరిగిన కార్యక్రమంలో అంజాన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ ఆర్థిక విధానాలు ఒకేలా ఉన్నాయని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.