హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అంటే ప్రధాని నరేంద్ర మోదీకి అక్కసా? ఇక్కడి ప్రజలు అన్నా, వారి మనోభావాలన్నా అలుసా? అన్న ప్రశ్నలకు సమాధానాలు ఇవి. ఎదుటివాళ్లు బాగుపడితే చూసి ఓర్వలేని మనస్తత్వం ఆయనదని చెప్పే సాక్ష్యాలివి. అవును! అధికారంలోకి వచ్చీ రావటంతోనే తెలంగాణకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఆయనది. కలం పోటుతో ఏడు తెలంగాణ మండలాలపై వేటు వేయించిన వ్యక్తిత్వం ఆయనది. తెలంగాణ రాష్ట్రం రావటమే ఇష్టం లేని మోదీ.. మొన్నటికిమొన్న రాష్ట్ర విభజనపై తన అక్కసు వెళ్లగక్కారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక తొలి క్యాబినెట్లో తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపి రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేశారు. కాంగ్రెస్ అర్థంపర్థం లేకుండా విభజన చేసిందన్న మోదీ.. అధికారంలోకి వచ్చాక ఆ తప్పులను సరిచేయడానికి ఏం చేశారు? అన్ని విషయాల్లో తెలంగాణను విస్మరించలేదా? మోదీ హయాంలో రాష్ర్టానికి చేసిందేమిటనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
అప్పటి నుంచే తెలంగాణపై కక్ష
కేంద్రంలోని మోదీ సర్కారు ఆది నుంచి ఇప్పటిదాకా తెలంగాణపై కక్షతో వివక్ష చూపుతున్నది. 2014లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు హుటాహుటిన ఢిల్లీ వెళ్లి నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకొన్నారు. ఇద్దరూ కలిసి తెలంగాణను తొలిదెబ్బ తీసే కుట్రకు తెరలేపారు. నరేంద్ర మోదీ.. ప్రధానిగా తన అధ్యక్షతన జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలోనే ఏడు మండలాల్లోని 211 గ్రామాలను ఏపీలో కలుపుతూ తీర్మానం చేశారు. కుక్కునూరు, వేలేరుపాడు, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం(వీఆర్‌పురం) మండలాలతోపాటు భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లోని కొన్ని గ్రామాలను ఏపీలో కలిపేశారు. ఆ తర్వాత దీనికి పార్లమెంట్లో ఆమోదముద్ర పడింది. ఇదం తా మోదీ చేసింది, చేయించిందే. అలాంటిది విభజనే సరిగా జరగలేదని మాట్లాడటం విస్మయానికి గురిచేస్తున్నది. భద్రాచలం మండలంలోని పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, ఎటపాక, గుండాల, పురుషోత్తమపట్నం గ్రామాలను ఏపీలో కలపడంతో.. ఆ ఐదు పంచాయతీలను వెంటనే తెలంగాణలో విలీనం చేయాలనే డిమాండ్‌తో భద్రాద్రి నిరసనలతో హోరెత్తుతున్నది. కన్నాయిగూడెం వాసులు జిల్లా కేంద్రం కాకినాడలో ఏమైనా పనుంటే 360 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తున్నది.
ఆర్థిక మూలాలను దెబ్బతీసే కుట్ర
పోలవరం ప్రాజెక్టు కోసమే ఆ ఏడు మండలాలను ఏపీలో విలీనం చేస్తున్నామని మోదీ చెప్పారు. కానీ దాని వెనుక తెలంగాణ ఆర్థిక మూలాలను దెబ్బతీసే కుట్ర ఉన్నదనేది తెలంగాణ మేధావుల మాట. కేంద్రం తీరుతో కోట్లాది రూపాయల సహజ సంపదను రాష్ట్రం కోల్పోయింది. భద్రాచలం, వేలేరుపాడు, కుక్కునూరు, వీఆర్‌పురం, చింతూరు మండలాల్లో ఎంతో విలువైన అబ్రకం (మైకా), క్వార్జ్, ఇనుప ఖని జం, కొరండ, ఆల్ైక్లెన్ రాక్స్ తదితర ఖనిజ సంపద నిల్వలు అపారంగా ఉన్నాయి. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలే స్వయంగా ప్రకటించారు. విలువైన సంపదలు ఉన్న ప్రాంతాలన్నింటినీ ఆంధ్రాలో విలీనం చేశారు.
కేసీఆర్ విశ్వప్రయత్నం.. మోకాలడ్డుతున్న కేంద్రం
ఏపీలో విలీనం చేసిన మండలాలను మళ్లీ తెలంగాణలో కలపాలని సీఎం కేసీఆర్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా భద్రాద్రి రాముడిని విడదీసిన విధానంపై ఆదినుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఐదు పంచాయతీలను యుద్ధప్రాతిపదికన తెలంగాణలో కలపాలని ఇప్పటికే ఏపీ సీఎం జగన్‌తో మాట్లాడారు. కేంద్రంలోని మోదీ సర్కారు మాత్రం తెలంగాణ ప్రయత్నానికి మోకాలడ్డుతున్నది. తెలంగాణపై అక్కసుతో కేసీఆర్ ప్రయత్నాన్ని అడ్డుకొంటున్నది.
కేసీఆర్ పాలన మాకూ కావాలి
తెలంగాణలో సంక్షేమం ఎంతో బాగున్నది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలన ప్రజలకు దగ్గరైంది. మమ్మల్ని మళ్లీ తెలంగాణలో కలిపితే కూతవేటు దూరంలోనే ఐటీడీఏ ఉంటుంది. 40 కిలోమీటర్ల దూరంలోనే భద్రాద్రి కలెక్టరేట్ ఉన్నది. ఆఫీసులన్నీ మాకు మళ్లీ అందుబాటులోకి వస్తాయి. చదువులు, ఉద్యోగాలు ఇలా అన్నీ తెలంగాణలోనే అనుకూలంగా ఉన్నాయి. మా బతుకులు మారాలన్నా, మేము, మా పిల్లలు సంతోషంగా ఉండాలన్నా మళ్లీ మమ్మల్ని తెలంగాణలో కలపాలి. కేసీఆర్ సార్ పాలన మాకూ కావాలి.
– సూరిశెట్టి సత్యనారాయణ, కన్నాయిగూడెం
విలీన గ్రామాల కోసం సరిహద్దుల దిగ్బంధం
రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం భద్రాచలం మండలంలోని ఐదు పంచాయతీలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపిందని, వాటిని తిరిగి తెలంగాణలో విలీనం చేయాలనే డిమాండ్‌తో శుక్రవారం అఖిలపక్ష నాయకులు భద్రాచలం నియోజకవర్గంలోని రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో నిరసన తెలిపారు. రహదారులపైనే సహపంక్తి భోజనాలు చేశారు. భద్రాచలం పట్టణలోని బ్రిడ్జి సెంటర్, కూనవరం రోడ్డు, గోళ్లగట్ట రోడ్డు, చర్ల రోడ్డులో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12వరకు రాస్తారోకో చేశారు. పోలీసులు కొందరు నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా తోపులాటలో ఇద్దరు సీపీఐ నాయకులకు గాయాలయ్యాయి. ధర్నాలో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీర య్య మాట్లాడుతూ.. ఐదు పంచాయతీలను ఏపీలో కలపడంతో భద్రాచలం పట్టణం ఏకాకి అయిందన్నారు. ఈ నష్టాన్ని నివారించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నదన్నారు.