న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: కశ్మీర్ అంశంలో పాకిస్థాన్‌కు మద్దతుగా హ్యూందాయ్, కియా, కేఎఫ్‌సీ చేసిన పోస్టులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో రెస్టారెంట్ సైప్లె చైన్ పిజ్జాహట్ కూడా అదే తరహా పోస్ట్ చేసి వివాదంలో ఇరుక్కున్నది. కశ్మీర్ వేర్పాటువాదులకు మద్దతుగా పాకిస్థాన్ ఏటా ఫిబ్రవరి 5న జరుపుకొంటున్న కశ్మీర్ సంఘీభావ దినానికి మద్దతునిస్తూ పిజ్జాహట్ పాక్ బ్రాంచీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాయ్‌కాట్ పిజ్జాహట్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉన్నది. దీంతో సంస్థ క్షమాపణలు చెప్పింది.
కశ్మీర్ వేర్పాటువాదులకు మద్దతుగా కార్ల తయారీ సంస్థ హ్యూందాయ్, దాని అనుబంధ సంస్థ కియా ఇటీవల పోస్టులు చేశాయి. కశ్మీరీలకే కశ్మీర్ చెందుతుందని, త్వరలోనే అక్కడి వారికి శాంతి చేకూరుతుందని కేఎఫ్‌సీ సంస్థ కూడా పోస్ట్ చేసింది. విమర్శలు వెల్లువెత్తడంతో ఆ సంస్థ క్షమాపణలు కోరాయి. 2020లో డోమినోస్ కూడా ఇలాంటి పోస్ట్ చేసి వివాదంలో చిక్కుకొన్నది. దీంతో పిజ్జాహట్పై నెటిజన్లు మండి పడుతున్నారు.
దక్షిణ కొరియా విచారం
హ్యూందాయ్ పోస్ట్‌పై ఆ సంస్థ ప్రధాన కార్యాలయం ఉన్న దక్షిణ కొరియా దౌత్యవేత్తకు మంగళవారం కేంద్రం సమన్లు జారీచేసింది. ఇలాంటి పోస్టులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని విదేశాంగ ప్రతినిధి ఆరిందమ్ బాగ్చీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హ్యూందాయ్ వివాదంపై దక్షిణ కొరియా విదేశాంగమంత్రి చుంగ్ యూ యంగ్ తనకు ఫోన్ చేసి విచారం వ్యక్తం చేశారని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. ఇదిలాఉండగా, కశ్మీర్ విషయంలో భారత్ విధానానికి వ్యతిరేకంగా కార్పొరేట్ సంస్థలను పాకిస్థాన్ కావాలనే ఎగదోస్తున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.