తాండూర్ : తాండూర్ సర్కల్ పోలీస్ పరిధిలో, బెల్లంపల్లి నియోజకవర్గంలోని పలు పోలీస్ స్టేషన్ ల పరిధిలో వ్యవసాయ మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్లను దొంగిలించి రాగి వైర్లు, సిల్వర్ తీగలను విక్రయిస్తున్న పదిమంది దొంగల ముఠా సభ్యులను ( Copper thieves ) పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి దొంగిలించిన కాపర్‌ను స్వాధీనం చేసుకుని, వారిని రిమాండ్ కు తరలించినట్లు తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవయ్య (CI Devaiah) తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
తాండూర్ సర్కిల్ పరిధి, వివిధ గ్రామీణ ప్రాంతాల్లో 21 ట్రాన్స్ ఫార్మర్లు చోరీకి గురయ్యాయని తెలిపారు. పోలీసులు సమన్వయంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టామన్నారు. అరెస్టు అయిన వారిలో రాజీవనగర్ కు చెందిన మంతెన మల్లేష్, మాదారం త్రీ ఇంక్లైన్ చెందిన దర్శనాల రమేష్, దూట వంశీ, దుర్గం మల్లేష్, ద్వారకాపూర్కు చెందిన జవ్వాజి రమేష్, శ్రీరాంపూర్‌కు చెందిన పస్థం శ్రీనివాస్, కిష్టంపేట కు చెందిన తోడేటి వెంకటి, తంగళ్లపల్లికి చెందిన కొడిపె సాయి కిరణ్, తురుపటి మల్లేష్, కోయ సురేందర్ ఉన్నారని తెలిపారు.
నిందితుల నుంచి సుమారు రూ.50 వేల విలువ గల కాపర్ వైరు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. చెడు వ్యసనాలకు బానిపై జల్సాగా బతకాలనే ఉద్దేశంతో తప్పుదోవ పట్టారన్నారు. దొంగల ముఠాను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బంది రాము, రాజేశ్, నరేష్ లను సీఐ దేవయ్య, ఎస్సై సౌజన్య అభినందించారు.