న్యూఢిల్లీ, మే 31: వంటనూనెల ధరలు మరింత తగ్గబోతున్నాయి. క్రూడ్ పామాయిల్, క్రూడ్ సోయబిన్ ఆయిల్, క్రూడ్ సన్‌ఫ్లవర్ నూనెలపై దిగుమతి సుంకాన్ని 10 శాతం వరకు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో దేశీయంగా వంటనూనెల రిటైల్ ధరలు మరింత తగ్గనున్నాయి. ఈ మూడు వంటనూనెలపై గతంలో 20 శాతం దిగుమతి సుంకాన్ని వసూలు చేసిన కేంద్రం..తాజాగా దీనిని 10 శాతానికి దించింది. దేశీయంగా వినియోగిస్తున్న వంటనూనెల్లో 50 శాతం దిగుమతులపై ఆధారపడుతున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో 159.6 లక్షల టన్నుల వంటనూనెలను దిగుమతి చేసుకున్నది.
వీటి విలువ రూ.1.32 లక్షల కోట్లు. వంటనూనెల దిగుమతులపై తగ్గించిన దిగుమతి సుంకం వెంటనే అమలులోకి వచ్చిందని తెలిపింది. ఈ మూడు వంటనూనెలపై దిగుమతి సుంకం(బేసిక్ కస్టమ్ డ్యూటీ, ఇతర చార్జీలు) కలుపుకొని మొత్తంగా 27.5 శాతం వసూలు చేస్తుండగా, తాజా నిర్ణయంతో 16.5 శాతానికి దిగొచ్చింది. కానీ, రిఫైన్డ్ ఆయిల్‌పై వసూలు చేస్తున్న 32.5 శాతం దిగుమతి సుంకాన్ని యథాతథంగా ఉంచింది. వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఇండియన్ విజిటేబుల్ ఆయిల్ ప్రొడ్యుసర్స్ అసోసియేషన్ స్వాగతించింది.
పెంచమంటే..తగ్గించారు..
దిగుమతి చేసుకునే వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని పెంచాలని కోరితే..కేంద్ర ప్రభుత్వం మాత్రం తగ్గించిందని ఎస్ఈఏ ప్రెసిడెంట్ మెహతా అస్థానా ఆందోళన వ్యక్తంచేశారు. దేశీయ ప్రాసెసింగ్ సంస్థలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దిగుమతి సుంకాన్ని 40 శాతానికి పెంచాలని గతంలోనే కేంద్రాన్ని కోరినప్పటికీ ప్రస్తుతం దీనిని 10 శాతానికి దించడం సబబుకాదని విమర్శించారు.