Health Tips | ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కాంటాక్ట్ లెన్సులు ధరిస్తారు. కంటి ఉపరితలంపై ఏర్పడిన కన్నీటిపొర మీద ఉంచగలిగేంత పలుచటి, వంపు కలిగిన కటకాలే (అద్దం) కాంటాక్ట్ లెన్సులు. సాధారణంగా ఇవి రంగులతో ఉండవు. కానీ, ధరించేవారు సులువుగా గుర్తించడానికి వీలుగా కొంత రంగును అద్దుతారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం వస్తున్న కాంటాక్ట్ లెన్సులు చాలా సహజంగా, సౌకర్యంగా ఉంటున్నాయి. వాటిలో మూడు ప్రధాన రకాలు..
హైడ్రోజెల్ లెన్సులు
కంటిలోని సహజమైన తేమను అనుకరిస్తూ అభివృద్ధి చేసిన ఈ లెన్సుల తయారీలో హైడ్రోఫైలిక్ పాలిమర్లను ఉపయోగిస్తారు. ఇవి సౌకర్యంగా ఉంటాయి కూడా. కాకపోతే, తొందరగా పొడిబారిపోతాయి. పైగా వీటితో కంటి లోపలికి ఆక్సిజన్ అందదు. దీంతో, ఎక్కువసేపు పెట్టుకోవడం కష్టం అవుతుంది. చౌకగా లభించడం వల్ల వీటికి ఆదరణ ఎక్కువ.
సిలికోన్ హైడ్రోజెల్ లెన్సులు
ఇవి విప్లవాత్మకమైనవి. వీటిని సిలికోన్, హైడ్రోజెల్ మెటీరియల్తో తయారు చేస్తారు. ఇవి కార్నియాకు మరింత ఆక్సిజన్ అందిస్తాయి. కంట్లో తేమను పట్టి ఉంచుతాయి. దీంతో రోజంతా ధరించినా సౌకర్యంగానే ఉంటుంది. పొడి వాతావరణంలో కూడా వీటి పనితీరు దెబ్బతినదు. కండ్లు పొడిబారే సమస్య ఉన్నవాళ్లకు ఈ రకం లెన్సులు మంచి ఎంపిక.
మూడో తరం
మూడోతరం కాంటాక్ట్ లెన్సులు మిగిలిన వాటితో పోలిస్తే.. మరింత సౌకర్యంగా, ఇంకొంత వెసులుబాటుగా ఉంటాయి. అధిక తేమను పట్టి ఉంచుతాయి. నీటి నష్టాన్ని నివారిస్తాయి. ప్రొటీన్లు తయారయ్యేలా చేస్తాయి. డిజైన్ కూడా మెరుగ్గా ఉండటంతో కంటిపాపలు- లెన్సుల రాపిడి తగ్గుతుంది. దీంతో ఎక్కువసేపు ధరించినా మంటగా అనిపించదు. ధర కాస్త ఎక్కువే.