తొర్రూరు, సెప్టెంబర్ 4: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో కత్తిపోటు ఘటన కలకలం రేపింది. భార్యాభర్తల మధ్య గొడవకు సంబంధించి వచ్చిన డయల్-112 కాల్‌కు స్పందించి అక్కడికి వెళ్లిన బ్లూకోట్స్ కానిస్టేబుల్‌పై ఓ యువకుడు కత్తితో దాడి చేయడంతో ఆయన గాయపడ్డారు. అనంతరం ఇనుప రాడ్లతోనూ దాడి చేసినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే.. గురువారం రాత్రి తొర్రూరు పట్టణంలోని గంగోత్రి వాటర్ ప్లాంట్ ఎదురుగా భార్యాభర్తలు గొడవ పడుతున్నారంటూ మహిళ డయల్-112కు సమాచారం అందించింది. దీంతో తొర్రూరు పోలీస్‌స్టేషన్‌లో బ్లూకోట్స్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ జాటోత్ రామచంద్ర రాత్రి సుమారు 11.20 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అక్కడ పరిస్థితిని తెలుసుకునే క్రమంలో దంతాలపల్లి మండలం ఆగపేట తూర్పు తండాకు చెందిన గూగుల్ కోటేశ్వర్ ఒక్కసారిగా కత్తితో కానిస్టేబుల్ రామచంద్రపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎడమ చేతి కింద, గుండె సమీపంలో కత్తిపోటు తగిలి గాయమైంది. అంతటితో ఆగకుండా నిందితుడు రెండు ఇనుప రాడ్లతో కూడా దాడి చేసినట్లు సమాచారం.
వెంటనే రామచంద్ర మరో పోలీస్ సిబ్బందికి సమాచారం అందించగా, పెట్రోలింగ్ వాహనంలో ఆయనను దవాఖానకు తరలించారు. వైద్యులు చికిత్స అందించి సుమారు ఆరు కుట్లు వేసినట్లు సమాచారం. ప్రస్తుతం కానిస్టేబుల్ రామచంద్ర హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, ఘటనకు పాల్పడిన కోటేశ్వర్‌ను పోలీసులు రాత్రికి రాత్రే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.