TANA | డాలస్, టెక్సాస్: తానా సంస్థ సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో ఆరు సంవత్సరాలుగా ‘నెల నెలా తెలుగు వెలుగు’ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెలా చివరి ఆదివారం అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశాలు (Zoom Meeting) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్ర భాషా దినోత్సవం జరుపుకొంటున్న సందర్భంగా తానా ప్రపంచసాహిత్యవేదిక ‘తెలుగే మన వెలుగు’ అనే అంశంపై ఆదివారం 95వ అంతర్జాల సమావేశం సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్ స్వాగతోపన్యాసంతో ప్రారంభమై ఉల్లాసంగా జరిగింది.
ముఖ్యఅతిథి, కీలకోపన్యాసకునిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ.. తెలుగు (Telugu) భాష పరిరక్షణ, పరివ్యాప్తికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే ఒక సలహా కమిటీని ఏర్పాటు చేసి తెలుగు భాషాభివృద్ధికి చేపట్టవలసిన చర్యల గురించి చర్చించి తగు విధివిధానాలను రూపొందిస్తామని అని అన్నారు. మన తెలుగు భాషకు అద్భుతమైన సేవ చేసిన మహనీయులను, ప్రముఖ వ్యక్తులను మరిచిపోకూడదని అందువల్లనే మా ఉండి ప్రాంతంలో పుట్టిన తిరుపతి వెంకట కవులు తిరుపతి శాస్త్రి, చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కొత్తగా కడుతున్న ఒక బ్రిడ్జికి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త డా. ఎల్లాప్రగడ సుబ్బారావు బ్రిడ్జిగా నామకరణం చేస్తున్నామని వెల్లడించారు.
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. ఆంగ్ల (English) భాష ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుంటూనే తెలుగు భాషను నిలబెట్టుకోవడంలో తల్లిదండ్రుల బాధ్యత గురుతరమైనదని అన్నారు. ప్రభుత్వం అన్ని శాఖల్లో తెలుగు భాషను వాడాలని, పరిపాలనా భాషగా తెలుగు ఉండాలని, ఆంగ్లంలో వచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులన్నీ వెంటనే తెలుగులో అనువాదం అయ్యేటట్లు చూడాలని కోరారు. దానివల్ల ఆంగ్లం, తెలుగు రెండు భాషలు వచ్చిన వారికి కొన్ని ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. కనీసం ఐదో తరగతి వరకు మాతృబాషలో విద్యాభోదన చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

Tana Meeting 1
ముఖ్యఅతిథి (Chief Guest)గా పాల్గొన్న ఆచార్య డా. శలాక రఘునాథ శర్మ మాట్లాడుతూ.. ఎన్ని భాషల్లోని పదాలనైనా అవలీలగా తనలో మిళితం చేసుకో గల శక్తి ఉన్న గొప్ప భాష తెలుగు అని అన్నారు. పరభాషీయులు, శ్రీకృష్ణ దేవరాయలతో సహా విదేశీయులు సైతం మన తెలుగు భాషా వైభవాన్ని మెచ్చుకున్నారని గుర్తు చేశారు. తెలుగు భాషను విస్తృతం చెయ్యడంలో నిర్లక్ష్యం తగదని పేర్కొన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతికశాఖ సంచాలకులు రేగుళ్ల మల్లికార్జునరావు తెలుగు భాష, సంస్కృతులకు పాటుపడుతున్న వారికి ప్రతి సంవత్సరం తెలుగు భాషా పురస్కారాలు, కళారత్న పురస్కారాలు అందజేస్తున్నామని అన్నారు.
గిడుగు రామమూర్తి మునిమనుమరాలు గిడుగు లక్ష్మీకాంతికృష్ణ తన ముత్తాత గిడుగు రామమూర్తి ఎన్నో ప్రతికూల పరిస్థితులను తట్టుకుని గ్రాంథిక (Grandhika) భాషను వ్యవహారిక భాషగా తీర్చిదిద్దారని అన్నారు. మేము కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ గిడుగు రామమూర్తి ఫౌండేషన్ను స్థాపించి ప్రతి సంవత్సరం భాషా సాహిత్య వికాసాల కోసం కృషిచేసిన వారికి పురస్కారాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు డా. మాడభూషి సంపత్ కుమార్ మాట్లాడుతూ.. తెలుగుకు ప్రాచీన భాష హోదా తెచ్చుకోవడంలో సఫలీకృతం అయినప్పటికీ, కేంద్రప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవడంలో వెనుకబడే ఉన్నామని అన్నారు. ఈ విషయంలో పార్లమెంట్ సభ్యుల సహకారం అవసరం అని తెలిపారు.
తెలుగు భాషోద్యమ సమాఖ్య కార్యదర్శి డా. గుంటుపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పిల్లలకు తెలుగు భాషను నేర్పడంలో అధునాతనమైన పద్ధతులను వాడాలని, కేవలం వారికి వచ్చే మార్కులతో సంతృప్తిపడకుండా వారికి భాష ఎంతవరకు పట్టుబడుతుందో అని ఆలోచించాలని అన్నారు. క్షేత్ర స్థాయిలో మార్పుల పట్ల ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. సీనియర్ జర్నలిస్ట్ రమేశ్ కందుల మాట్లాడుతూ.. కాలక్రమేణా తెలుగుభాష అన్ని రంగాల్లో మార్పులు చెందుతూ వస్తుందని, అందరం కలసి తెలుగుభాషకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేద్దాం అని అన్నారు.
పూర్తి కార్యక్రమాన్ని https://youtube.com/live/cIDCCp8L4iQ లింక్లో వీక్షించవచ్చు.

Tana Nela Nela Telugu

Tana Nela Nela Telugu 1