న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో బాంబు వార్త కలకలం సృష్టించింది. మంగళవారం సాయంత్రం రాజీవ్ చౌక్ సమీపంలోని కన్నాట్ ప్లేస్‌లోని ఓ మొబైల్ స్టోర్‌లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి తన వద్ద బాంబ్ ఉందని.. ఆ ప్రాంతాన్ని పేల్చివేస్తానని హెచ్చరించాడు. ఇది విన్న చుట్టపక్కల ఉన్న వారంతా భయాందోళనలకు గురై పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ వ్యక్తిని పట్టుకొని అదుపులోకి తీసుకున్నాయి. ముందు జాగ్రత్తగా బాంబ్ డిస్పోజబుల్ స్క్వాడ్‌తో ఆ ప్రాంతంలో సోదాలు తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా డీసీపీ దీపక్ యాదవ్ మాట్లాడుతూ రాజీవ్ చౌక్‌లోని వన్ ప్లస్ స్టోర్ నుంచి సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తు బెదింపులకు పాల్పడినట్లు తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. స్థానిక సిబ్బంది వెంటనే స్టోర్‌కు చేరుకొని అదుపులోకి తీసుకున్నారన్నారు. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సదరు వ్యక్తిని పోలీస్‌స్టేషన్‌కు తరలించామని, అతని వద్ద ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆ వ్యక్తి ఓఖ్లాలోని ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నట్లు తెలిపారు. విచారణ సమయంలో అతడు ‘స్థిరంగా లేడు’ అని వివరించారు.