సిద్దిపేట : కేంద్రం ఆదేశాల మేరకే పంటలను కొనుగోలు చేస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణమని, వెంటనే రైతాంగానికి భేషరతుగా క్షమాపణ ( Unconditional Apology ) చెప్పాలని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు ( Harish Rao ) డిమాండ్ చేశారు. సిద్దిపేటలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ సర్కార్ ( Revanth Government ) రైతాంగం పట్ల అవలంభిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు.
కేంద్రం పంటలను ఎంత కొనమంటే అంతే కొనుగోలు చేస్తాం.. ఏ పంట కొనుగోలు చేయమంటే అదే పంట కొనుగోలు చేస్తామని కేబినేట్లో తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కేంద్రం కొనుగోలు చేయకుంటే ఇక ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరిట రాహుల్ గాంధీ రైతులకు బోనస్ కల్పిస్తామని, ఎంత పంట పండిస్తే అంత పంటను కొనుగోలు చేస్తామని ప్రకటించి నేడు చేతులెత్తేయడం శోచనీయమని అన్నారు. రాహుల్ గాంధీ జన్మదినం రోజున రేవంత్ రెడ్డి రైతు డిక్లరేషన్ను బోంద పెట్టాడని విమర్శించారు. రైతులకుబోనస్ లేదు. అన్ని పంటలకు మద్దతు ధరకు కొనదు. కేంద్రం ఏ పంటను కొనమంటే అదే పంటను కొంటం. ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.
కేంద్రం మక్కలు, జొన్నలు కొనుగోలు చేయదని అటువంటప్పుడు మక్కలు, జొన్నలు కొనలేమని చేతులెత్తేస్తుందని విమర్శించారు. ప్రజలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ భేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్ని పంటలను కొనుగోలు చేశారని , రైతుకు మద్దతు కల్పించారని వెల్లడించారు.
ఇకపై ఎకరానికి రెండు యూరియా బస్తాలు మాత్రమే
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎకరానికి రెండు యూరియా బస్తాలు మాత్రమే ఇస్తామని కొత్త సర్క్యులర్ ఇచ్చారని, ఆ రెండు కూడా ఒకటి ఈ నెలలో, ఇంకోటి వచ్చే నెలలో ఇస్తారని హరీష్రావు వెల్లడించారు. కేసీఆర్ హయాంలో ఆటో డ్రైవర్లకు చెప్తే యూరియా ఇంటి దగ్గర వేసి పోయేవారని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతులంటే ఎందుకు ఇంత చిన్నచూపని అన్నారు.