హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ( Congress Promises ) మోసపూరితమైనవని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Talasani Srinivas Yadav ) విమర్శించారు. సోమవారం సికింద్రాబాద్ లోని తహసీల్ కార్యాలయంలో 51 మంది కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు ఆర్ధిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పలువురు దివ్యాంగులు, వృద్ధులు పెన్షన్ ల కోసం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు తమకు పెన్షన్లు ఇవ్వాలని కోరారు. అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు కు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం స్థానిక మీడియాతో తలసాని మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు అదనంగా తులం బంగారం ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి మూడేళ్లు కావస్తుంది. నేటి వరకు ఒక్క లబ్ధిదారుడి కైనా తులం బంగారం ఇచ్చారా అని ప్రశ్నించారు.
హామీల అమలు చేస్తారా లేదా అనిప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్ళు కావస్తున్నా అమలు చేయకపోవడం ప్రజలను మోసం చేయడం కాదా? అని ప్రశ్నించారు. పేద ప్రజలు ఆత్మగౌరవం తో బ్రతకాలనే ఆలోచన తో కేసీఆర్ ప్రభుత్వం లబ్ధిదారుడిపై పైసా భారం లేకుండా ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
కార్యక్రమంలో తహసీల్దార్ పాండు నాయక్, మాజీ కార్పొరేటర్లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, టి. మహేశ్వరి, బన్సీలాల్ పేట, బేగంపేట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వెంకటేషన్ రాజు, నాయకులు టి. శ్రీహరి, నరేందర్, కొండాపురం మహేష్ యాదవ్, కిషోర్, లక్ష్మీపతి, ఆరీఫ్, ఆంజనేయులు, ప్రేమ్, శేఖర్, చంద్ర ప్రకాష్, నాగభూషణం, అబ్బాస్, రవి, మోహిన్, నాగలక్ష్మి, సీమా తదితరులు ఉన్నారు.