రాజన్న సిరిసిల్ల, మే 27 (నమస్తే తెలంగాణ) : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయానికి కాంగ్రెస్ నాయకుడు, జిల్లెల్ల మాజీ ఉప సర్పంచ్ తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్ తాళం వేశారు. సెంటర్లో వడ్లు పోసి రెండు నెలలు కావొస్తున్నా కాంటా వే యడం లేదని ఆగ్రహించారు.
ఈ క్రమంలో బుధవారం నేరెళ్ల సహకార సంఘ కార్యాలయంలో సిబ్బంది ఉండగానే తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. తమకు అనుకూలంగా ఉన్నవారికి, పలుకుబడి ఉన్నవారి ధాన్యాన్ని ముందుగా కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. స్థానికులు, సిబ్బంది సముదాయించడంతో ఆందోళన విరమించి తాళం తెరిచారు. ధాన్యం కొనుగోళ్ల తీరుపై సొంత పార్టీ నాయకులే నిరసనకు దిగడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.