CPRO | హైదరాబాద్, ఫిబ్రవరి 7 ( నమస్తే తెలంగాణ ) : ముఖ్యమంత్రి చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (సీపీఆర్వో) ఎవరు? అనేది ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం 2023 డిసెంబర్లో సీనియర్ జర్నలిస్ట్, కాంగ్రెస్ నేత అయోధ్యరెడ్డిని సీపీఆర్వోగా నియమించింది. అప్పటి నుంచి ఆయనే సీపీఆర్వోగా కొనసాగుతున్నారు. అయితే.. గత నెలలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు మాత్రం సీపీఆర్వో స్థానంలో ఉదయసింహా వెళ్లారు. ఈయన ఓటుకు నోటు కేసులో మూడో నిందితుడు (ఏ-3)గా ఉన్నారు. మహారాష్ట్రకు చెందిన అజయ్ వాసుదేవ్బోస్ అనే వ్యక్తి ఇటీవల దావోస్ పర్యటనకు సంబంధించిన వివరాలను ఆర్టీఐ ద్వారా తీసుకున్నారు. కేంద్ర, రాష్ర్టాల నుంచి పర్యటించిన బృందాలు, వారి ఆతిథ్యం కోసం స్విట్జర్లాండ్‌లోని భారత ఎంబసీ చేసిన ఖర్చు వివరాలను ఆయన పొందారు. కేంద్రం ఇచ్చిన సమాధానం ప్రకారం.. తెలంగాణ నుంచి దావోస్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సహా మొత్తం 18 మంది తరలివెళ్లారు.
ఇందులో ఉదయ్‌సింహాను సీపీఆర్వోగా పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వం సీపీఆర్వోను ఎప్పుడు మార్చింది? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికారిక ఉత్తర్వుల్లో సీపీఆర్వోగా అయోధ్యరెడ్డి ఉండగా, దావోస్ పర్యటనకు ఉదయసింహాను సీపీఆర్వోగా ఎలా తీసుకెళ్లారని ప్రశ్నిస్తున్నారు. పైగా సీఎం రేవంత్‌రెడ్డి నిందితుడిగా ఉన్న కేసులోని నిందితుడిని తీసుకెళ్లడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఉదయ్‌సింహా విషయంలో కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చిందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే నిజమైతే జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం పరువు పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై బీఆర్ఎస్ నేత కొణతం దిలీప్ విమర్శలు గుప్పించారు. ‘ఓటుకు నోటు కేసులో బ్యాగ్ మోసిన ఉదయ్‌సింహా సీఎం పీఆర్వో ఎప్పుడయ్యారు?’ అని ప్రశ్నించారు. సాధారణంగా సీపీఆర్వో ఒక్కరే ఉంటారని చెప్పారు. ‘ప్రస్తుత సీపీఆర్వోగా ఉన్న బోరెడ్డి అయోధ్యరెడ్డి ఉద్యోగం ఉందా? ఊడిందా?’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘జర్నలిజం, పబ్లిక్ రిలేషన్స్‌లో ఏ అర్హతలూ లేని ఉదయ్‌సింహాను సీపీఆర్వోగా చూపించడం ఏమిటి? తనతోపాటు నేరంలో పాల్గొని, జైలు పాలైనందుకే ఉదయ్‌సింహాకు రేవంత్‌రెడ్డి ఈ నజరానా ఇచ్చారా?’ అని ప్రశ్నించారు.
సీఎంతోపాటు దావోస్‌కు వెళ్లిన బృందంలో రోహిన్‌రెడ్డి కూడా ఉన్నారు. ఆయన హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు వెళ్లిన బృందంలో రోహిన్‌రెడ్డి ఎందుకు ఉన్నట్టు? అని ప్రశ్నిస్తున్నారు. ఆయన వృత్తిరీత్యా డాక్టర్ (డెంటిస్ట్) అని, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారాలు ఉన్నాయని చెప్తున్నారు. రోహిన్‌రెడ్డి వృత్తికి, దావోస్‌కు సంబంధం లేదని అంటున్నారు. కేవలం సీఎం సన్నిహితుడనే కారణంతోనే ఆయనను దావోస్‌కు తీసుకెళ్లారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.