హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): శాసనసభ సమావేశాల్లో ప్రజాసమస్యలను గాలికొదిలేసి కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన భూ అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్నదని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సభలో అవినీతిని ప్రశ్నిస్తున్న బీజేపీ గొంతును మైకులు కట్ చేస్తూ అణచివేస్తున్నారని మండిపడ్డారు. నిషేధిత 22ఏ జాబితాపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ 4 గంటలపాటు మతిభ్రమించినట్టు సంబంధం లేకుండా మాట్లాడారే తప్ప 50 లక్షల మంది రైతులు, పేదలకు ఎలాంటి పరిషారం చూపలేదని, ఈ మొత్తం భూ బాగోతంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
కుత్బుల్లాపూర్‌లోని ఐడీపీఎల్‌కు చెందిన రూ.33 వేల కోట్ల విలువైన 333 ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లినా వెనక్కు తీసుకోకపోవడంలో ప్రభుత్వ పెద్దలకు 30 శాతం వాటాలు ఉన్నాయా అని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉంటూనే రూ.1,400 కోట్ల కాంట్రాక్టులను రూ.4వేల కోట్లకు పెంచుకోవడం ముమ్మాటికీ క్విడ్-ప్రో-కో అని ధ్వజమెత్తారు. ఈ విషయంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.